వెండింగ్ జోన్‌పై వివాదం
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:14 AM
‘ఆపరేషన్ లంగ్స్’ కార్యక్రమంలో తొలగించిన దుకాణదారులకు ప్రత్యామ్నాయం చూపేందుకుగాను పాతజైలురోడ్డులో ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ వెండింగ్ జోన్ వివాదంలో పడింది.
పాతజైలురోడ్డు వద్ద వీఎంఆర్‌డీఏ స్థలంలో స్మార్ట్ వెండింగ్ జోన్‌కు జీవీఎంసీ ప్రతిపాదన
ఆ సంస్థ అనుమతి లేకుండా పనులు
కౌన్సిల్ ఆమోదం లేకుండా టెండరు పిలిచారంటూ కోర్టులో మాజీ కార్పొరేటర్ పిటిషన్
నేడు విచారణ
ఈలోగానే హడావిడిగా పనులు ప్రారంభం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘ఆపరేషన్ లంగ్స్’ కార్యక్రమంలో తొలగించిన దుకాణదారులకు ప్రత్యామ్నాయం చూపేందుకుగాను పాతజైలురోడ్డులో ఏర్పాటుచేస్తున్న స్మార్ట్ వెండింగ్ జోన్ వివాదంలో పడింది. జైలురోడ్డులో సెంట్రల్ పార్కును ఆనుకుని ఉన్న స్థలం వీఎంఆర్‌డీఏకు చెందినది. ఆ సంస్థ అనుమతి లేకుండానే అక్కడ పనులు చేపట్టడం, కౌన్సిల్/ప్రత్యేకాధికారి ఆమోదం లేకుండా టెండర్లు పిలవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మాజీ కార్పొరేటర్ ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బుధవారం విచారణకు వస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం వెండింగ్ జోన్ పనులు ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది.
ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందనే ఉద్దేశంతో నగరంలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న దుకాణాలన్నింటినీ జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ‘ఆపరేషన్ లంగ్స్’ పేరుతో తొలగించారు. వారందరికీ స్మార్ట్ వెండింగ్ జోన్‌లు, స్ర్టీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటుచేసి ప్రత్యామ్నాయం చూపిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఎండాడ, పాతజైలురోడ్డులో వీఎంఆర్‌డీఏ సెంట్రల్‌పార్కును ఆనుకుని ఉన్న స్థలం, దువ్వాడలో స్మార్ట్ వెండింగ్ జోన్‌లు ఏర్పాటుచేయడానికి జీవీఎంసీ కౌన్సిల్‌లో ఆమోదం తీసుకున్నారు. కంటెయినర్ మాదిరి దుకాణాలతోపాటు డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉండేలా స్మార్ట్ వెండింగ్‌జోన్‌కు జీవీఎంసీ అధికారులు డిజైన్ చేశారు. దువ్వాడ, ఎండాడ ప్రాంతాల్లో ఏర్పాటుచేసే స్మార్ట్ వెండింగ్ జోన్‌లకు సుమారు రూ.4.5 కోట్లు చొప్పున, పాతజైలురోడ్డులో ఏర్పాటుచేసే స్మార్ట్ వెండింగ్‌జోన్‌కు రూ.ఆరు కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తంలో ఒక వాటాను రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ద్వారా సర్దుబాటు చేస్తే, ఒక వాటాను జీవీఎంసీ సదుపాయాల కల్పనకు, మిగిలిన వాటాను లబ్ధిదారులు బ్యాంక్ రుణం ద్వారా భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు పంపించగా, రాష్ట్రప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఎండాడ, దువ్వాడల్లో ప్రతిపాదించిన స్థలాలు జీవీఎంసీవి కాగా, పాతజైలురోడ్డులోని స్థలం మాత్రం వీఎంఆర్‌డీఏకు చెందినది కావడంతో స్మార్ట్ వెండింగ్ జోన్ ఏర్పాటుకు సదరు సంస్థ అనుమతిని జీవీఎంసీ కోరింది. వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతి రాకుండానే మూడుచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు కొన్నాళ్ల కిందట సమాయత్తం కాగా వీఎంఆర్‌డీఏ అభ్యంతరం తెలిపింది. దీంతో పనులు నిలిచిపోయాయి.
టెండరు పిలవకుండానే...
పాత జైలురోడ్డులో రూ.ఆరు కోట్ల వ్యయంతో స్మార్ట్ వెండింగ్ జోన్ పనులు చేపట్టేందుకు ఇటీవల భూమిపూజ నిర్వహించారు. అక్కడ పనులు చేయడానికి జీవీఎంసీ ఆగమేఘాల మీద టెండర్లు పిలిచింది. అయితే పాతజైలురోడ్డుతోపాటు మరో రెండుచోట్ల స్మార్ట్ వెండింగ్ జోన్‌లు ఏర్పాటు ప్రతిపాదనకు మాత్రమే కౌన్సిల్‌లో ఆమోదం తీసుకున్నారు. పనులు చేపట్టాలంటే టెండరు పిలిచేందుకు కౌన్సిల్ లేదా ప్రత్యేక అధికారి అనుమతి పొందడం తప్పనిసరి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఇంజనీరింగ్ అధికారులు పాతజైలురోడ్డులో రూ.రెండు కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు టెండర్ పిలవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మాజీ కార్పొరేటర్ ఒకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బుధవారం విచారణ జరగనున్నది. ఇలాంటి తరుణంలో మంగళవారం పాతజైలురోడ్డులో హడావిడిగా పనులు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఇదిలావుండగా రూ.ఆరు కోట్లతో వెండింగ్ జోన్ పనులంటూ శిలాఫకంలో పేర్కొని, రూ.రెండు కోట్లతో టెండరు పిలవడం గమనార్హం.