అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన!
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:24 PM
స్థానిక సంస్థలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
జడ్పీటీసీ, ఎంపీపీ ఆశావహులు
అధికం కావడమే కారణం
కూటమి, వైసీపీలోనూ ఇదే పరిస్థితి
అందరి దృష్టి జడ్పీ చైర్మన్ పదవిపైనే..
(పాడేరు/ఆంధ్రజ్యోతి)
స్థానిక సంస్థలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గతానికి భిన్నంగా ఈ దఫా జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులతోపాటు ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా అన్ని పార్టీలకు కత్తిమీద సాములా మారింది. గిరిజన ప్రాంతంలో సైతం రాజకీయ చైతన్యం పెరగడంతో పదవులపై అందరికీ ఆసక్తి పెరిగింది. దీనికి తోడు కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కావడంతో జడ్పీటీసీ స్థానానికి విపరీతమైన పోటీ ఏర్పడింది. మండల స్థాయిలో పెద్దగా వ్యవహరించే ఎంపీపీ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రస్తుతం ఏజెన్సీలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం అధికార, విపక్ష పార్టీలకు తలనొప్పిగా తయారైంది. ఈ పరిణామాలతో రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జిల్లాలోని 11 జడ్పీటీసీ 172 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అయితే జడ్పీటీసీ స్థానానికి 5 నుంచి 10 మంది ఆశావహులుండగా, ఎంపీటీసీ స్థానాలకు అదే స్థాయిలో పోటీ పడుతున్నారు. కూటమిలో సీట్ల సర్దుబాటు ఖరారు కానప్పటికీ మూడు పార్టీలకు చెందిన ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వైసీపీలోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇప్పటికే రెండు మండలాలకు ఒకటి చొప్పున ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆశావహుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వైసీపీకి చెందిన పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం తమ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆశావహుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. కాని అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన పడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జడ్పీ పీఠంపై అధికార, విపక్ష పార్టీల కన్ను...
జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వంజంగి కాంతమ్మ, జల్లిపల్లి సుభద్ర పదవులను అనుభవించారు. ఇదే సమయంలో జిల్లాలోనే జిల్లా పరిషత్ ఏర్పాటు కావడంతో జడ్పీ పీఠంపై కూర్చోవాలని మన్యంలోని అన్ని పార్టీల నేతలు ఆశ పడుతున్నారు. తాము జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనే ఆశ అన్ని పార్టీల నేతల్లోనూ బలంగా ఉంది. ఇన్నాళ్లుగా ఏజెన్సీలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కన్నేశారు. అలాగే పార్టీల అధిష్ఠానాలు సైతం జిల్లాలోని జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాయి.