అధ్యయన యాత్రపై తర్జనభర్జన
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:22 AM
కార్పొరేటర్ల అధ్యయన యాత్ర అంశం ఇప్పుడు జీవీఎంసీలో హాట్‌టాపిక్‌గా మారింది.
కేరళ వెళ్లేందుకు సిద్ధమైన కార్పొరేటర్లు
వీలుకాదన్న కమిషనర్
ప్రజా ప్రతినిధుల ద్వారా కార్పొరేటర్ల ఒత్తిడి
మరో 12 రోజుల్లో ముగియనున్న జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం
ఈ తరుణంలో యాత్రకు అనుమతిస్తే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆలోచిస్తున్న ఉన్నతాధికారి
విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
కార్పొరేటర్ల అధ్యయన యాత్ర అంశం ఇప్పుడు జీవీఎంసీలో హాట్‌టాపిక్‌గా మారింది. కేరళ వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ కార్పొరేటర్లంతా మేయర్ పీలా శ్రీనివాసరావు ద్వారా కమిషనర్ కేతన్‌గార్గ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే కార్పొరేటర్ల పదవీకాలం ఈనెల 17తో ముగుస్తుండడంతో కమిషనర్ ససేమిరా అన్నారు. దీంతో కార్పొరేటర్లు కూటమికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులను ఆశ్రయించారు. కార్పొరేటర్ల విజ్ఞప్తి మేరకు కమిషనర్ కేతన్‌గార్గ్‌కు ఆయా ప్రజా ప్రతినిధులు ఫోన్ చేసి కనీసం నాలుగు రోజుల పర్యటనకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలని ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మరో 12 రోజుల్లో పదవీకాలం ముగియబోతున్న కార్పొరేటర్లు ఏం అధ్యయనం చేస్తారు?, నగరానికి ఉపయోగపడే సలహాలు, సూచనలతో ఏం నివేదిక అందజేస్తారని?...కమిషనర్ ఆలోచిస్తున్నారు. ఒకవేళ ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి అధ్యయన యాత్రకు నిధులు మంజూరుచేస్తే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యయన యాత్రపై కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
కార్పొరేటర్లు ఏడాదికి ఒకసారి దేశంలోని వివిధ నగరాలకు వెళ్లి అక్కడ జరిగే అభివృద్ధి పనులు, పౌరసేవలు అందించే విధానం, పరిశుభ్రత, స్థానిక సంస్థలకు ఆదాయ వనరులను పెంపొందించుకునే మార్గాలపై అధ్యయనం చేసేందుకు మునిసిపల్ చట్టంలో వెసులుబాటు కల్పించారు. ఐదేళ్లపాటు అధ్యయన యాత్రలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుత పాలకవర్గం ఇప్పటివరకూ నాలుగుసార్లు వెళ్లి వచ్చింది. మొదటి ఏడాది కరోనా కారణంగా యాత్రకు వెళ్లలేదు. ఐదేళ్ల పదవీకాలంలో నాలుగుసార్లు మాత్రమే యాత్రకు వెళ్లినందున, మరోసారి పర్యటనకు వెళ్లేందుకు కార్పొరేటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. అధ్యయన యాత్రకు బదులుగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదించగా, కార్పొరేటర్లు మాత్రం తమకు అధ్యయన యాత్రే కావాలని పట్టుబడుతున్నారు.