Share News

సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:43 PM

జిల్లాలో సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోని పంచాయతీలు, కీలకమైన పంచాయతీల్లో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై పార్టీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి.

సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు

మండల కేంద్రం, కీలక పంచాయతీలపై ప్రత్యేక దృష్టి

రంగంలోకి దిగిన అధికార కూటమి, విపక్ష వైసీపీ

పోటీకి ఉత్సాహం చూపుతున్న నాయకులు

ఆశావహులతో ప్రధాన పార్టీలు చర్చలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోని పంచాయతీలు, కీలకమైన పంచాయతీల్లో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై పార్టీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి. ఏజెన్సీలో మండల కేంద్రాల్లోని పంచాయతీలకు డిమాండ్‌ ఉంది. మండలంలోని ఇతర పంచాయతీల్లోని సర్పంచులందరి కంటే మండల కేంద్రానికి చెందిన సర్పంచ్‌కు నిధులు, అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద పలుకుబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో మండల కేంద్రం సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ప్రతి పార్టీ నుంచి ఐదుగురికి తక్కువ కాకుండా పోటీ పడుతున్నారు. పాడేరు, అరకులోయ, చింతపల్లి, అనంతగిరి, కొయ్యూరు వంటి మండల కేంద్రాల సర్పంచ్‌ స్థానాలకు మరీ డిమాండ్‌ ఉంది. దీంతో అధికార కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన, విపక్ష వైసీపీ సైతం మండల కేంద్రాల్లోని సర్పంచ్‌ అభ్యర్థులుగా గట్టి వారిని పెట్టాలని భావిస్తున్నాయి. అదే స్థాయిలో ఒక్కో పార్టీ నుంచి ఐదుగురు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతుండడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ఆశావహులతో చర్చలు జరిపే ప్రక్రియలో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉండగా గతంలో మావోయిస్టుల ప్రభావంతో ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదు. కాని ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో సర్పంచులుగా బరిలో దిగేందుకు పోటీ పడుతున్నారు. దీంతో పంచాయతీల్లో ఎవరిని బరిలోకి దించాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంచాయతీ కేంద్రం, సమీపంలోని గ్రామాలకు చెందిన గిరిజనుల అభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఆలోచనతో పార్టీల నేతలు ముందుకు వెళుతున్నారు.

Updated Date - Nov 14 , 2026 | 10:44 PM