ఈక్వలెన్స్‌పై వివాదం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:45 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈక్వలెన్స్ సర్టిఫికెట్ల వ్యవహారంపై వివాదం నడుస్తోంది.
బయట రాష్ట్రాల ఇంటర్మీడియట్ సర్టిఫికెట్‌లతో ఇక్కడ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు అందులో నకిలివీ ఉన్నట్టు
ఏయూకు అందిన ఫిర్యాదులు
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఈక్వెలెన్స్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందిగా సదరు విద్యార్థులకు ఆదేశాలు
అవి ఇవ్వకుండానే పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతించిన కొన్ని కళాశాలలు
మిగిలిన కళాశాలల అభ్యంతరం
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈక్వలెన్స్ సర్టిఫికెట్ల వ్యవహారంపై వివాదం నడుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికెట్లతో పలువురు ఏయూ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరారు. అయితే, అలా చేరిన విద్యార్థుల సర్టిఫికెట్లపై ఫిర్యాదులు వచ్చాయి. నకిలీ ధ్రువపత్రాలతో అనేకమంది డిగ్రీలో చేరినట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ బోర్డుతో తత్సమాన ధ్రువీకరణ పత్రం (ఈక్వలెన్స్ సర్టిఫికెట్) సమర్పించాలని ఆదేశించారు. అలా సమర్పించిన విద్యార్థులను మాత్రమే తదుపరి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టంచేశారు. దీంతో ఇతర రాష్ర్టాల విద్యార్థులను పలు కళాశాలలు ఈక్వలెన్స్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందిగా ఆదేశించాయి. సర్టిఫికెట్లను తీసుకువచ్చిన వారిని మాత్రమే నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు అంగీకరించాయి. సర్టిఫికెట్లు సమర్పించని విద్యార్థులను పెండింగ్‌లో పెట్టాయి. ఇదే విషయాన్ని వర్సిటీ అధికారులకు కొన్ని కాలేజీలు తెలియజేశాయి.
చక్రం తప్పిన ఉద్యోగులు
అయితే ఈ తరహా ప్రవేశాలు ఎక్కువగా ఉన్న కొన్ని కాలేజీలు మాత్రం విద్యార్థులు సర్టిఫికెట్లు సమర్పించకపోయినా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అభ్యంతర పెట్టలేదు. ఇదే విషయాన్ని కొన్ని కళాశాలలు యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చాయి. తమ కాలేజీల్లో ఉన్న ఎంతోమంది విద్యార్థులు ఈక్వలెన్స్ సర్టిఫికెట్ సమర్పించలేదన్న కారణంతో ఫీజులు చెల్లించకుండా నిలిపివేశామని, మరి ఆ కాలేజీలకు ఎలా అవకాశం కల్పించారని ప్రశ్నించాయి. దీనిపై స్పందించిన ఎగ్జామినేషన్ అధికారులు ఈక్వలెన్స్ సర్టిఫికెట్లు సమర్పించకుండా ఫీజులు కట్టిన వారిని పెండింగ్‌లో పెడతామని చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైనా ఈక్వలెన్స్ సర్టిఫికెట్ సమర్పిస్తే ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తామని తెలియజేసినట్టు చెబుతున్నారు. ఇకపోతే, ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి డిగ్రీ నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈక్వలెన్స్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలంటే..
ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికెట్లతో ఇక్కడ డిగ్రీలో చేరిన విద్యార్థులంతా ఈక్వలెన్స్ సర్టిఫికెట్ కోసం రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి. సదరు సర్టిఫికెట్లు, బోర్డు వివరాలన్నింటినీ ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్టయితే ధ్రువపత్రం జారీచేస్తుంది. లేనిపక్షంలో ఫేక్ సర్టిఫికెట్‌గా నిర్ధారిస్తుంది.