సీఎంహెచ్‌వో సీటు వివాదం!
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:01 AM
జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి పోస్టింగ్ వివాదాస్పదమైందనే ప్రచారం జరుగుతోంది.
జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారిగా భాస్కరరావు నియామకం
డాక్టర్ నరేష్‌కుమార్‌ను రిలీవ్ చేసేందుకు కమిషనర్ ససేమిరా
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి పోస్టింగ్ వివాదాస్పదమైందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రధాన వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ నరేష్‌కుమార్‌ను శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.భాస్కరరావును నియమించింది. రాష్ట్రంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీలో పారిశుధ్య నిర్వహణ కత్తిమీద సామే. నిత్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీల్లో పూడికతీత, చెత్త సేకరణ, తరలింపు సక్రమంగా జరిగేలా చూడాల్సి ఉంటుంది. డాక్టర్ నరేష్‌కుమార్ సుమారు నాలుగేళ్లపాటు సీఎంహెచ్‌వోగా పనిచేయడంతో ఆయనకు ప్రజారోగ్య విభాగంపై మంచి పట్టుంది. రెండేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి ఉత్తమ ర్యాంకులు రావడంలో ఆయన పాత్ర కీలకమని ప్రస్తుత కమిషనర్ భావిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో సింహాచలం గిరిప్రదక్షిణ, నవంబరులో పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో అనుభవజ్ఞుడైన డాక్టర్ నరేష్‌కుమార్ బదిలీ కావడం కమిషనర్‌కు మింగుడుపడడం లేదని చెబుతున్నారు. కనీసం గిరిప్రదక్షిణ పూర్తయ్యేంత వరకైనా నరేష్‌కుమార్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు. కాగా సీఎంహెచ్‌వోగా పోస్టింగ్ దక్కించుకున్న డాక్టర్ భాస్కరరావు పార్వతీపురం మన్యం జిల్లాలో రిలీవ్ అయి గురువారం నగరానికి వచ్చారు. అయితే డాక్టర్ నరేష్‌కుమార్ రిలీవ్ కాకపోవడంతో బాధ్యతలు స్వీకరించడానికి అవరోధం ఏర్పడింది.
కాగా డాక్టర్ నరేష్‌కుమార్‌ను రిలీవ్ చేయడం జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌కు ఇష్టం లేదని, ఈ నేపథ్యంలో భాస్కరరావును కొన్నాళ్లు ఆగిన తర్వాత రిపోర్టు చేయాలని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ తాను ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్‌ఓ బాధ్యతలు నుంచి రిలీవ్ అయినందున తక్షణం కొత్తపోస్టులో చేరాలని ఆయన ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా సీఎంహెచ్‌వో పోస్టుపై వివాదం మొదలైందని జీవీఎంసీ అఽధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కరోనా కలకలం
33 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్
ఐసోలేషన్‌లో బాఽధితుడు
ఆరోగ్య శాఖ అప్రమత్తం
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. కొత్తగా పాజిటివ్ కేసు నమోదైంది. కలెక్టరేట్‌కు సమీపంలోని అఫీషియల్ కాలనీలో 33 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ నెల ఆరో తేదీన సదరు వ్యక్తి భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఆయన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఒక వైద్యుడి వద్దకు వెళ్లారు. వైద్యుడి సూచనల మేరకు కరోనా నిర్ధారించే ఆర్టీపీసీఆర్ పరీక్షను చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులు ల్యాబ్ సిబ్బంది తెలియజేశారు. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు బాధితుడి ఇంటికి వెళ్లి మరోసారి స్వాబ్ నమూనా సేకరించి కేజీహెచ్‌లోని వీఆర్‌డీఎల్ ల్యాబ్‌కు పంపించారు. గురువారం ఉదయం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి సమీక్షించారు. ఆరోగ్యం మెరుగ్గానే ఉండడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. అతడితో కాంటాక్ట్ హిస్టరీ ఉన్న ఆయన భార్యకు పరీక్ష నిర్వహించగా, నెగిటివ్ వచ్చిందని తెలిపారు.
నగరంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో జ్వర లక్షణాలతో బాధపడుతూ కొవిడ్ పరీక్షలు చేయించుకునే వారి వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ల్యాబ్ నిర్వాహకులకు ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల్లో కరోనా లక్షణాలు ఉంటే వెంటనే నమూనాలు సేకరించి కేజీహెచ్‌కు పంపించాలని ఆదేశించినట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. కరోనా కేసు నమోదైనప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే కేజీహెచ్‌లో 18 పడకలతో ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారన్నారు. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేశామని, అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించినట్టు తెలిపారు.
ఆరు నెలల్లో పరిస్థితి మారుద్దాం
యువ కార్మికులకు ఉక్కు సీఎండీ పిలుపు
ఇకపై రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లే ఆపరేషన్
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో ఇకపై రెండు బ్లాస్ట్ ఫర్నేసు (బీఎఫ్)లు మాత్రమే నడుస్తాయని సీఎండీ ప్రభాకర్ స్పష్టంచేశారు. వివిధ విభాగాలకు చెందిన యువ కార్మికులతో ఆయన గురువారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్టీల్ ప్లాంటు గత పదేళ్లుగా నష్టాల్లోనే ఉందని గుర్తు చేశారు. ఆరు నెలల సమయం ఇచ్చి, చెప్పినట్టు అంతా వింటే లాభాల్లోకి తీసుకువస్తానన్నారు. దానికి తగిన వ్యూహం తన వద్ద ఉందన్నారు. ప్లాంటులో ఎక్కడ చూసినా తుక్కు కనిపిస్తున్నదని, దానిని అమ్మితే టన్నుకు రూ.42 వేలు వస్తుందన్నారు. బ్లూమ్స్ కూడా పెద్దవి తయారు చేస్తున్నామని, వాటి సైజు తగ్గించుకోవలసి ఉందన్నారు. మిల్లులు నడవాలంటే గ్యాస్ కావాలని, కోక్‌ఓవెన్లను సమర్థంగా నడపాలని కోరారు. కొత్తగా ఆరో కోక్ ఓవెన్ నిర్మించడానికి నిధులు లేవని స్పష్టంచేశారు. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, దాని తరువాతే ఉత్పత్తి అని పేర్కొన్నారు. నష్టాలు తగ్గితే ఏమైనా చేయగలుగుతామని ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలన్నారు.