Share News

వివాదాస్పదం!

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:11 AM

ఆనందపురం మండలం వేములవలస హౌసింగ్‌ కాలనీ అభివృద్ధి నుంచి నిర్మాణం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి.

వివాదాస్పదం!

వేములవలస హౌసింగ్‌ కాలనీ పరిస్థితి

82 ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ప్లాట్ల అభివృద్ధి

పలు అంశాలపై కోర్టు కేసులు

గృహనిర్మాణ సంస్థ అనుమతి లేకుండానే నిర్మాణాలు

బిల్లులు ఇవ్వలేమని అధికారుల స్పష్టీకరణ

విశాఖపట్నం/ఆనందపురం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం వేములవలస హౌసింగ్‌ కాలనీ అభివృద్ధి నుంచి నిర్మాణం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. హౌసింగ్‌ కార్పొరేషన్‌ అనుమతిలేకుండానే లబ్ధిదారులు నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. అయినా రాజకీయ పలుకుబడితో బిల్లులు మంజూరుచేయాలని అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈనెల 11వతేదీన జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆనందపురం జడ్పీటీసీ సభ్యుడు కోరాడవెంకటరావు బిల్లుల మంజూరు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుపై ప్రస్తావించారు.

వేములవలస ఇళ్ల కాలనీపై అధికారులు హౌసింగ్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నగరం నుంచి ఆనందపురం జాతీయరహదారి నుంచి అతి సమీపంలో దొరతోటకు వెళ్లే రోడ్డులో వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేఅవుట్‌ అభివృద్ధిచేసింది. ఆనందపురం, వేములవలసలో గూడులేని 82 మందిని ఎంపికచేసి ఒక్కొక్కరికి 1.5 సెంట్లు చొప్పున కేటాయించి ఇళ్ల మంజూరుకు ప్రతిపాదించింది. జాతీయరహదారికి ఆనుకుని కాలనీ అభివృద్ధిచేయడంతో కొందరు వైసీపీ నేతలు అక్కడ ప్లాట్లపై కన్నేసి బినామీల పేరిట మంజూరు చేయించుకున్నారు. ఈలోగా హౌసింగ్‌ సంస్థ నుంచి ఇళ్ల నిర్మాణాలకు అప్పటి ఎమ్మెల్యే ప్రతిపాదించారు. వేములవలస గ్రామీణ ప్రాంతం కావడంతో లబ్ధిదారులే సొంతంగా ఇళ్లు నిర్మించుకోవల్సి ఉంది. హౌసింగ్‌ అధికారులు అనుమతి ఇస్తారని వైసీపీ నాయకులు చెప్పడంతో కాలనీలో ప్లాట్లు తీసుకున్న వారిలో ఎక్కువమంది సొంతంగా ఇళ్లు నిర్మించారు. ఓ కీలక వైసీపీ నేత రెండుప్లాట్లు తీసుకుని ఇళ్లు నిర్మించారు. లేఅవుట్‌లో తన భూమి ఉందని ఒకరు కోర్టుకు వెళ్లడంతో హౌసింగ్‌ అధికారులు అప్రమత్తమై మంజూరు ప్రక్రియను పక్కనపట్టేశారు.

ఆ తరువాత 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వేములవలస ఇళ్ల కాలనీలో అక్రమాలపై స్థానిక టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత రెండు ప్లాట్లు తీసుకుని ఇళ్లు నిర్మించడం, బినామీలకు ప్లాట్ల కేటాయింపుపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణ పెండింగ్‌లో ఉంది. ఇలా పలు వివాదాలు చుట్టుముట్టడంతో వేములవలస కాలనీకి అనుమతిలేనందున లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించలేమని జిల్లా హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి పీడీ సూరిబాబు స్పష్టంచేశారు. స్థల వివాదంపై కోర్టు కేసు పరిష్కరమైందని, మిగిలిన ఫిర్యాదులపై విచారణ తేలాల్సి ఉందన్నారు. కాలనీలో ప్రస్తుతం ఉన్న కుటుంబాల కోసం ఈపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తారని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతి లేనందున బిల్లులు ఇవ్వలేమన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసే ఇళ్లకు సంబంధించి పునాదులు, గోడలు, స్లాబ్‌.. ఇలా ప్రతి దశ పూర్తైన వెంటనే జియోట్యాగింగ్‌చేసి ఫొటోలు, బిల్లుమొత్తం వివరాలను అప్‌లోడ్‌చేయాలని, అప్పుడే స్టేజిల వారీగా బిల్లులు మంజూరవుతాయన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:11 AM