Share News

పోర్టు కాలుష్యాన్ని నియంత్రించండి

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:32 AM

విశాఖ పోర్టు కార్యకలాపాలతో ఏర్పడుతున్న కాలుష్యాన్ని సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర షిప్పింగ్‌ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు ఎంపీ ఎం.శ్రీభరత్‌ విజ్ఞప్తి చేశారు.

పోర్టు కాలుష్యాన్ని నియంత్రించండి

కేంద్ర షిప్పింగ్‌ మంత్రికి ఎంపీ శ్రీభరత్‌ విజ్ఞప్తి

డస్ట్‌-ఫ్రీ బల్క్‌ కార్గో హ్యాండ్లింగ్‌ కోసం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ రూపొందించాలి

ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా చూడాలి

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):

విశాఖ పోర్టు కార్యకలాపాలతో ఏర్పడుతున్న కాలుష్యాన్ని సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర షిప్పింగ్‌ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు ఎంపీ ఎం.శ్రీభరత్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీలో వినతిపత్రం అందజేశారు. విశాఖలో భౌగోళిక పరిస్థితులు, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని వినతిపత్రంలో పేర్కొన్నారు. గత నెల 10న విశాఖ కలెక్టరేట్‌లో ఏపీపీసీబీ, జిల్లా యంత్రాంగం, విశాఖ, గంగవరం పోర్టు యాజమాన్యాలు, ప్రధాన ఆపరేటర్లు, సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించామని, పోర్టు ప్రాంతాల్లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌, నిల్వ, రవాణా ప్రక్రియల వల్ల ఏర్పడుతున్న ధూళి కాలుష్యం నివారణపై చర్చించామని అందులో ప్రస్తావించారు. ఆధునిక యంత్రాలతో పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నా కాలుష్యంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉందన్నారు. దేశంలో ప్రధాన పోర్టులన్నింటికీ వర్తించే డస్ట్‌-ఫ్రీ బల్క్‌ కార్గో హ్యాండ్లింగ్‌ కోసం సమగ్రమైన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ రూపొందించాలని ఎంపీ కోరారు. గాలి నాణ్యతపై తాజా వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వార్షిక థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నిర్వహించాలని కోరారు. నగరంలో ప్రస్తుతం ఒక్కటే ఆన్‌లైన్‌ కంటిన్యూయస్‌ యాంబియంట్‌ ఎయిర్‌క్వాలిటీ మానటరింగ్‌ స్టేషన్‌ ఒకటే ఉందని పేర్కొంటూ మరిన్ని స్టేషన్లు ఏర్పాటుచేయాలని కోరారు. మూడు నెలలకొకసారి కాలుష్యంపై సమావేశాలు ఏర్పాటుచేసే వ్యవస్థ ఏర్పాటుచేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా పోర్టుల కార్యకలాపాలు కొనసాగేలా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 08 , 2026 | 12:32 AM