Share News

పెట్‌ స్కాన్‌కు ప్రతిబంధకాలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:17 AM

క్యాన్సర్‌ రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కేజీహెచ్‌ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు.

పెట్‌ స్కాన్‌కు ప్రతిబంధకాలు

  • కేజీహెచ్‌ అధికారుల ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించని ఆరోగ్య శాఖ అధికారులు

  • న్యూక్లియర్‌ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండడమే కారణం

  • అందుకే తిరస్కృతి

  • అందుబాటులోకి వచ్చినట్టయితే క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

క్యాన్సర్‌ రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కేజీహెచ్‌ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. గత కొన్నాళ్లుగా ‘పెట్‌ స్కాన్‌’ కోసం ప్రతిపాదనలు పంపుతున్నప్పటికీ ఆరోగ్య శాఖ నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీనికి ప్రధాన కారణం అత్యంత కీలకమైన న్యూక్లియర్‌ మెడిసిన్‌ విభాగంలో వైద్యులు లేకపోవడమేనని తెలుస్తోంది.

పెట్‌స్కాన్‌ నిర్వహణ, వ్యాధి నిర్ధారణ, దశను తెలుసుకోవడం, చికిత్స ఫలితాలను అంచనా వేయడం వంటి అంశాల్లో న్యూక్లియర్‌ విభాగానికి చెందిన వైద్యులు కీలకం. ఆ విభాగంలో ప్రస్తుతం ఒక్క వైద్యుడు కూడా లేరు. ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులైతే ఉన్నాయి. కొన్నాళ్ల కిందట ఆయా క్యాడర్లకు చెందిన వైద్యులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానాల్లో కొత్తగా ఎవరూ చేరలేదు. దీంతో ఆ విభాగంలో అందించే సేవలతోపాటు పెట్‌స్కాన్‌ ప్రతిపాదనలపైనా ప్రభావం పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి మాత్రం అదేమీ అడ్డంకి కాదని చెబుతున్నారు. విభాగంలో సీనియర్‌ బయోకెమిస్ట్‌ అందుబాటులో ఉన్నారని, పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఉండబోవని పేర్కొంటున్నారు.

ఈ నిపుణులు కీలకం

పెట్‌ స్కాన్‌ నిర్వహించాలంటే న్యూక్లియర్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన వైద్యుడు ఉండాలి. పరీక్షను పర్యవేక్షించడంతోపాటు నివేదికను విశ్లేషించాల్సిన బాధ్యత సదరు వైద్యుడిపై ఉంటుంది. అలాగే, న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌ కూడా ఉండాలి. ఆయన రేడియో థార్మికతను, స్కానింగ్‌ నిర్వహణను పర్యవేక్షిస్తాడు. అదేవిధంగా రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్‌ కూడా ఉండాలి. వీరితోపాటు రేడియాలజిస్ట్‌ కూడా ఉండి సీటీ చిత్రాల పరిశీలన, అవసరమైన నివేదిక తయారీకి సహకారాన్ని అందించాలి. వీరిలో ఒక్క బయో కెమిస్ట్‌ మాత్రమే అందుబాటులో ఉండడంతో పెట్‌ స్కాన్‌ ఏర్పాటులో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.

క్యాన్సర్‌ రోగులకు మేలు

కేజీహెచ్‌కు వివిధ రకాల క్యాన్సర్‌లకు సంబంధించి వైద్యం పొందేందుకు ప్రతిరోజూ సుమారు 100 మంది వరకు వస్తుంటారు. ఇన్‌పేషెంట్లుగా మరో 60 మంది సేవలు పొందుతుంటారు. పెట్‌ స్కాన్‌ ఉన్నట్టయితే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుంటుంది. ఆ స్కాన్‌ చేయడం ద్వారా శరీరంలో క్యాన్సర్‌ కణాల చురుకుదనం, వ్యాధి వ్యాప్తి, చికిత్స ప్రభావం వంటి వాటిని పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో అయితే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖర్చవుతుంది. అంత మొత్తం భరించే స్థోమత పేద, మధ్య తరగతి వర్గాలకు ఉండదు. అందుకే కేజీహెచ్‌లో ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. అయితే, కార్యరూపం దాల్చేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూక్లియర్‌ విభాగంలో వైద్యుల పోస్టుల భర్తీ తద్వారా పెట్‌ స్కాన్‌ ఏర్పాటుకు ఆస్పత్రి అధికారులతో పాటు నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా కృషిచేయాల్సి ఉంది. ఇదిలావుండగా పెట్‌ స్కాన్‌ ఏర్పాటుచేసేందుకు అనుగుణంగా సీఎస్‌ఆర్‌ బిల్డింగ్‌లో బంకర్‌ నిర్మాణాన్ని చేపట్టారు.


వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్‌

ఫుడ్‌ ఫెస్టివల్‌ కూడా...

పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

నగరంలో వార్డుల వారీగా సమావేశాలు

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):

వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ వెల్లడించారు. క్రిస్మస్‌ పండుగను పరిగణనలోకి తీసుకుని ఉత్సవ్‌ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తామన్నారు. సోమవారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గోవా, కేరళ మాదిరిగా నగరంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. ఇందుకు పర్యాటక అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేసి, దాని ద్వారా ప్రాజెక్టులకు భూ కేటాయింపులు, అనుమతులు వంటివి చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు. పర్యాటక కార్యకలాపాల కోసం వేర్వేరుగా ఉన్న శాఖ, కార్పొరేషన్‌ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ప్రతిపాదన ఉందన్నారు. అధికారులు, సిబ్బందిని అందరూ కలిసి పనిచేయడంతోనే పెట్టుబడుల సదస్సు విజయవంతం అయ్యిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ఏర్పాటుకానున్న పరిశ్రమలకు సంబంధించిన వివరాలు పరిశ్రమల శాఖ నుంచి త్వరలో తమకు అందుతాయన్నారు. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌లో పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు వేగవంతం చేసేందుకు యత్నిస్తామన్నారు.

జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 79 పంచాయతీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లుచేస్తున్నామన్నారు.

పంచాయతీ ఎన్నికల తరువాత ప్రతి గ్రామంలో ప్రతి నెలా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జీవీఎంసీలో వార్డుల వారీగా ప్రతి నెలా సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయా వార్డుల్లో నెలకురెండుసార్లు పర్యటించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశామన్నారు. నగరానికి గోదావరి జలాలు సరఫరా, బీచ్‌లో మురుగునీరు, వ్యర్థజలాల నిర్వహణపై ఈ వారాంతంలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నగరానికి గోదావరి జలాలను తీసుకురానున్నందున రిజర్వాయర్లలో పూడికతీత, కొత్త రిజర్వాయర్ల నిర్మాణంవంటిపై దృష్టిసారించామని కలెక్టర్‌ తెలిపారు.


23 నుంచి నృసింహ దీక్షలు

సింహాచలం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):

వరాహ లక్ష్మీనృసింహస్వామి దీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు ఈఓ వెంకటరావు తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు సింహగిరిపై కల్యాణ మండపం వద్ద తొలివిడత మండల దీక్షలు, డిసెంబరు 2న 32 రోజుల దీక్షలకు శ్రీకారం చుడతామన్నారు. జనవరి 2, 20, 27 తేదీల్లో దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీక్షల విరమణ రోజుల్లో ఆలయ కల్యాణ మండపంలో శాంతి కల్యాణం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 01:17 AM