విద్యుదాఘాతంతో కాంట్రాక్టు కార్మికుడి మృతి
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:13 PM
జీకేవీధి మండలం సీలేరు జల విద్యుత్ కేంద్రం ఓడీ యార్డులో గురువారం విద్యుదాఘాతంతో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు.
సీలేరు జల విద్యుత్ కేంద్రం ఓడీ యార్డులో ఘటన
సీలేరు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరు జల విద్యుత్ కేంద్రం ఓడీ యార్డులో గురువారం విద్యుదాఘాతంతో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక జల విద్యుత్ కేంద్రంలో 2019 నుంచి సీలేరుకు చెందిన గంగిరి గణేశ్(30) కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం అతను విధులకు హాజరయ్యాడు. దీంతో ఓడీ యార్డులో యూనిట్-2కు సంబంధించిన జంపర్ల బోల్టులు బిగించే పనిని జెన్‌కో అధికారులు అతనికి అప్పగించారు. ఆ పనులు చేస్తున్న క్రమంలో గణేశ్ విద్యుదాఘాతానికి గురై సుమారు 12 అడుగుల పైనుంచి కిందకు పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సీపీఆర్ చేసినా అతనిలో ఎటువంటి చలనం లేకపోవడంతో జెన్‌కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవ్యహెల్త్ సెంటర్‌కు తరలించారు. వైద్యాధికారిణి మృదుల ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైదులుఉ అప్పటికే గణేశ్ మృతి చెందినట్టు నిర్ధారించారు.
భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం
జల విద్యుత్ కేంద్రంలో ఏ చిన్న మరమ్మతు పనులు నిర్వహించాలన్నా ముందుగా ఎల్‌సీ అనుమతులను పొందాల్సి ఉంటుంది. అనంతరం విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ పనులను నిర్వహించేవారు ముందు జాగ్రత్త చర్యగా సేఫ్టీ బెల్టు, చేతికి రబ్బర్ గ్లౌజులు, హెల్మెట్ ధరించి యార్డులో పనులు చేపట్టాలి. అయితే గురువారం ఓడీ యార్డులో జంపర్ల విద్యుత్ తీగలకు మరమ్మతులు చేపట్టేటప్పుడు ఇవేవీ పాటించలేదని తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా పనులు
విద్యుదాఘాతంతో మృతి చెందిన గణేశ్ అన్‌స్కిల్డ్ కాంట్రాక్టు కార్మికుడు. సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 12 మంది వరకు అన్‌స్కిల్డ్ కాంట్రాక్టు కార్మికులు ఉండగా, వీరిని నిబంధనల ప్రకారం కేవలం స్కిల్డ్ ఉద్యోగుల వద్ద సహాయకులుగా మాత్రమే వినియోగించుకోవాలి. కానీ జెన్‌కో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అన్ని పనులకు కాంట్రాక్టు కార్మికులనే వినియోగిస్తుంటారని, ఏదైనా ప్రమాదాలు సంభవిస్తే వాటిని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనపై ఎలక్ర్టికల్ అవుట్‌డోర్ ఏడీఈ శ్రీనివాసరావును స్థానిక విలేకరులు వివరణ కోరగా మూడు నెలలకొకసారి హాట్‌లైన్ సిబ్బంది యార్డును సందర్శించి జంపర్ల వద్ద హాట్‌స్పాట్స్ వస్తే జంపర్లు మార్చడం వంటి పనులు చేపడతారని, వారి సూచనల మేరకు గురువారం పనులు చేపట్టారన్నారు. ప్రమాదవశాత్తూ గణేశ్ కింద పడిపోయాడని, విద్యుదాఘాతంతో కాదని, అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
గణేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలి
విద్యుదాఘాతంతో గణేశ్ మృతి చెందడంతో అతని కుటుంబాన్ని జెన్‌కో యాజమాన్యం అన్ని విధాలుగా ఆదుకోవాలని సీపీఎం నాయకుడు అంపురంగి బుజ్బిబాబు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం జీకేవీధి మండల నాయకుడు, గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు డిమాండ్ చేశారు. కాగా సంఘటన స్థలాన్ని సీలేరు ఎస్‌ఐ ఎండీ యాసిన్ పరిశీలించారు. ప్రమాదంపై స్థానిక జెన్‌కో అధికారుల నుంచి వివరాలు సేకరించారు.