Share News

నేటి నుంచి కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగుల పెన్‌డౌన్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:57 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగులు ఆదివారం నుంచి పెన్‌డౌన్‌ నిరసన చేపట్టనున్నామని సంఘం జిల్లా కో-ఆర్డినేటర్లు గౌరిశంకర్‌, సోమేశ్‌ తెలిపారు.

నేటి నుంచి కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగుల పెన్‌డౌన్‌
ఆర్‌ఎంకి పెన్‌డౌన్‌ నిరసనపై నోటీసు అందజేస్తున్న కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగులు

చింతపల్లి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగులు ఆదివారం నుంచి పెన్‌డౌన్‌ నిరసన చేపట్టనున్నామని సంఘం జిల్లా కో-ఆర్డినేటర్లు గౌరిశంకర్‌, సోమేశ్‌ తెలిపారు. శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రి ఎదుట భోజన విరామ సమయంలో కాంట్రాక్టు మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగులు ఆందోళన చేశారు. అనంతరం ఆర్‌ఎం డాక్టర్‌ ఇక్రమ్‌ని కలిసి పెన్‌డౌన్‌ నిరసన చేపట్టనున్నట్టు నోటీసుని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కో-ఆర్డినేటర్లు విలేకరులతో మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు, ఇతర ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందన్నారు. పెన్‌డౌన్‌లో భాగంగా ఆన్‌లైన్‌ సేవలను పూర్తిగా నిలిపివేస్తామన్నారు. కేవలం రోగులకు వైద్య సేవలు మాత్రమే అందిస్తామన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి జి.వసంత కుమారి, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 11:57 PM