పరిశ్రమలకు నిరంతరం నీరు
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:57 AM
పరిశ్రమలకు ఇకపై నిరంతరం నీరు సరఫరా కానున్నది.
నరవ ఎస్‌టీపీ నుంచి పారిశ్రామిక ప్రాంతానికి పైప్‌లైన్ ఏర్పాటు
జీవీఎంసీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం
రూ.150 కోట్లతో పీపీపీ కింద ప్రాజెక్టు
ప్రైవేటు సంస్థ వాటా రూ.90 కోట్లు, అమృత్ 2.0 కింద కేంద్రం నుంచి రూ.42.5 కోట్లు
పదేళ్లపాటు నిర్వహణకు జీవీఎంసీ రూ.17.5 కోట్లు కేటాయింపు
నగర పాలక సంస్థకు ఏటా రూ.45 కోట్లు అదనపు ఆదాయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పరిశ్రమలకు ఇకపై నిరంతరం నీరు సరఫరా కానున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రూ.150 కోట్ల వ్యయంతో జీవీఎంసీ ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల జీవీఎంసీకి ఏటా రూ.45 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీ పరిమాణంలో నీటిని వినియోగించే పరిశ్రమలు జీవీఎంసీఈ నుంచి బల్క్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బల్క్ కనెక్షన్స్ దాదాపు 20 వరకు ఉన్నాయి. వాటికి నీటిని జీవీఎంసీ ఏలేరు, రైవాడ రిజర్వాయర్ల నుంచి కాలువ ద్వారా నరవలోని వాటర్ ట్రీట్‌మెంట్‌ప్లాంటుకు తీసుకువచ్చి, అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తుంది. నేవీ, స్టీల్‌ప్లాంటు హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీ, గంగవరం పోర్టు, వైజాగ్ పోర్టు, కోరమాండల్, వీఎస్‌ఈజెడ్ వంటి సంస్థలకు బల్క్ కనెక్షన్ ద్వారా రోజుకు పది మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. ఒక కిలోలీటర్ నీటికి జీవీఎంసీ రూ.90 చొప్పున పరిశ్రమలు నుంచి వసూలు చేస్తోంది. దీనివల్ల ఏటా రూ.200 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇదిలావుండగా తమకు అదనంగా నీరు సరఫరా చేయాలంటూ హెచ్‌పీసీఎల్‌తోపాటు మరికొన్ని సంస్థలు జీవీఎంసీని చాలా ఏళ్లుగా కోరుతున్నాయి. ఇలా పరిశ్రమల నుంచి జీవీఎంసీకి ప్రస్తుతం నాలుగు ఎంజీడీల నీటికి డిమాండ్ ఉంది. అందుకు అవసరమైన వనరులు అందుబాటులో లేకపోవడంతో జీవీఎంసీ అచేతనంగా ఉండిపోవాల్సి వచ్చింది. నరవ వద్ద కొత్తగా నిర్మించిన 108 ఎంఎల్‌డీ సివరేజ్ ట్రీట్‌మెంటు ప్లాంటు (ఎస్‌టీపీ)లో శుద్ధి చేసిన నీరు పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడుతున్నప్పటికీ పైప్‌లైన్ లేకపోవడం అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో నరవ నుంచి గోపాలపట్నం, ఎయిర్‌పోర్టు మీదుగా పారిశ్రామిక ప్రాంతానికి పైప్‌లైన్ ప్రత్యేకంగా నిర్మించాలంటే సుమారు రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. అంతమొత్తాన్ని జీవీఎంసీ స్వయంగా భరించే పరిస్థితి లేకపోవడంతో అమృత్ 2.0 కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులతోపాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పనచేశారు. దీనికి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, రెండు రోజుల కిందట ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
జీవీఎంసీకి ఏటా రూ.45 కోట్లు అదనపు ఆదాయం
రూ.150 కోట్ల ప్రాజెక్టు పీపీపీ విధానంలో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జీవీఎంసీకి ఏటా రూ.45 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో రూ.90 కోట్లు ప్రైవేటు సంస్థ పెట్టుబడిగా పెడితే, మరో రూ.47.5 కోట్లు అమృత్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ప్రాజెక్టు నిర్వహణకు పదేళ్లకు అయ్యే ఖర్చు రూ.17.5 కోట్లు జీవీఎంసీ భరిస్తుంది. ప్రస్తుతం బల్క్ కనెక్షన్ చార్జీల కింద జీవీఎంసీకి ఏటా రూ.200 కోట్లు ఆదాయం వస్తోంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభమైతే అదనంగా నాలుగు ఎంజీడీల నీటిని సరఫరా చేయడం వల్ల రూ.80 కోట్లు వసూలవుతుంది. అందులో రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టిన ప్రైవేటు సంస్థకు, రూ.45 కోట్లు జీవీఎంసీకి లభిస్తుంది. ఇలా ప్రాజెక్టుని పదేళ్లపాటు నిర్వహించేలా ప్రైవేటు సంస్థతో జీవీఎంసీ ఒప్పందం చేసుకుంటుంది.