మధురవాడకు నిరంతరం తాగునీరు
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:57 AM
నగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడలో నిరంతర తాగునీటి ప్రాజెక్టు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రూ.725 కోట్ల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
ఐదు నుంచి 13 వార్డుల్లో 37 వేల ఇళ్లకు కొత్తగా కొళాయి కనెక్షన్లు
మొత్తం వ్యయంలో 25 శాతం ఉచితంగా సమకూర్చనున్న కేంద్ర ప్రభుత్వం
త్వరలో టెండర్లు పిలిచేందుకు సమాయత్తం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడలో నిరంతర తాగునీటి ప్రాజెక్టు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కోసం జీవీఎంసీ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టులను ప్రపంచ బ్యాంకు ఎంపిక చేసింది. అందులో రూ.725 కోట్ల వ్యయంతో మధురవాడ ప్రాంతానికి నిరంతర తాగునీటి సరఫరా కోసం రూపొందించిన ప్రాజెక్టు ఉంది. దీనికి ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. దీంతో ప్రాజెక్టు కోసం టెండర్లు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌డేటా సెంటర్, కాపులుప్పాడ ప్రాంతంలో ఐటీ సంస్థలు రానుండడంతో మధురవాడ పరిసరప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తాగునీరు, యూజీడీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవడంపై జీవీఎంసీ దృష్టిసారించింది. మధురవాడ ప్రాంతానికి ఇప్పటికే రూ.550 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల (యూజీడీ) ప్రాజెక్టు మంజూరవ్వగా, తాజాగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.725 కోట్ల వ్యయంతో నిరంతర తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25 శాతం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తుంది. మిగిలిన నిధులను ప్రపంచబ్యాంకు ఎలాంటి హామీ లేకుండా ఇస్తామని ప్రకటించింది.
జీవీఎంసీ పరిధిలో ఐదు నుంచి 13 వార్డుల్లో ప్రస్తుతం ఉన్న కొళాయి కనెక్షన్లతోపాటు కొత్తగా 37 వేల కనెక్షన్లు ఇచ్చేలా ప్రాజెక్టు రూపొందించారు. మధురవాడ పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు నిరంతరం నీటిసరఫరా చేయాలని జీవీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.
నీటిసరఫరా ప్రాజెక్టుకు
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం
మధురవాడ ప్రాంతంలో నిరంతర తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జీవీఎంసీ అధికారులు టెండర్లు తయారీ ప్రక్రియపై దృష్టిసారించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పోలవరం ఎడమ కాలువ లేదా కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నరవ మీదుగా ముడసర్లోవకు నీటిని తీసుకువస్తారు. అక్కడ 65 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ట్రీట్‌మెంట్ ప్లాంటును నిర్మిస్తారు. ట్రీట్‌మెంట్ చేసిన నీటిని పైప్‌లైన్ ద్వారా ఎండాడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి కొమ్మాది వరకు కొత్తగా పైప్‌లైన్ నిర్మించి నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటారు.
హెల్మెట్ లేకుంటే బైక్ సీజ్
ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదుచేసి కోర్టులో చార్జిషీట్
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు కఠినచర్యలు
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రోడ్డు ప్రమాదాలతోపాటు వాటి కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురైనప్పుడు హెల్మెట్‌లు ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై పోలీసులు కేసులు నమోదుచేసి జరిమానా విధిస్తున్నప్పటికీ ఆశించిన మార్పు కనిపించడం లేదు. ఈ-చలాన్ విధించి వదిలేస్తున్నారనే నిర్లక్ష్యంతో చాలామంది యువత హెల్మెట్ ధరించడాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనం నడిపితే వారిపై ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదుచేయడంతోపాటు వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న 48 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. వారందరిపైనా కేసులు నమోదుచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని సీఐ హుస్సేన్ తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలోనూ ఇదే పద్ధతి అమలుచేయనున్నట్టు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. బైక్ నడిపేవారంతా ఇకపై హెల్మెట్ ధరించకపోతే కఠినచర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.