నగరమంతటికీ నిరంతరం తాగునీరు
ABN , Publish Date - May 21 , 2026 | 12:52 AM
స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందుతున్న విశాఖలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అత్యంత కీలకమైన తాగునీటి సరఫరాపై దృష్టిసారించారు. ఇప్పటికే నార్త్ వెస్ట్ సిటీలో అమలు చేస్తున్న నిరంతర నీటి సరఫరాను నగరమంతటికీ విస్తరించాలని నిర్ణయించారు.
ఇప్పటికే రూ.386.16 కోట్లతో నార్త్‌వెస్ట్ ఏరియాలో ప్రాజెక్టు అమలు
త్వరలో మధురవాడ ప్రాంతంలో రూ.725.18 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభం
మిగిలిన ప్రాంతానికి కూడా అందుబాటులోకి తేవాలని జీవీఎంసీ నిర్ణయం
మూడు నెలల్లో డీపీఆర్ పూర్తి
దీనివల్ల నీటి వృథాకు చెక్
గణనీయంగా పెరుగుతున్న జీవీఎంసీ ఆదాయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందుతున్న విశాఖలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అత్యంత కీలకమైన తాగునీటి సరఫరాపై దృష్టిసారించారు. ఇప్పటికే నార్త్ వెస్ట్ సిటీలో అమలు చేస్తున్న నిరంతర నీటి సరఫరాను నగరమంతటికీ విస్తరించాలని నిర్ణయించారు.
నగరంలో గల సుమారు ఇరవై ఆరు లక్షల జనాభాకు తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజూ 265 మిలియన్ లీటర్లు, పరిశ్రమల అవసరాలకు మరో 145 మిలియన్ లీటర్లు మొత్తం ప్రతిరోజూ 410 మిలియన్ లీటర్లు సరఫరా చేస్తోంది. అయితే పరిశ్రమల నుంచి మరో 63 ఎంఎల్‌డీ నీటికి డిమాండ్ ఉన్నప్పటికీ జీవీఎంసీ సరఫరా చేయలేకపోతోంది. ఇదిలావుండగా ప్రపంచబ్యాంకు ప్రాజెక్టులో భాగంగా ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని మురళీనగర్, మాధవధార, సీతమ్మధార, మల్కాపురం, మర్రిపాలెం వంటి ప్రాంతాల్లోని 45 వేల ఇళ్లలో నివసిస్తున్న మూడు లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా రూ.386.16 కోట్లతో నిరంతర తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు జీవీఎంసీ కొన్నేళ్ల కిందట శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంతో 78 శాతం నిధులను ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ), మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు దాదాపు చివరి దశకు చేరడంతో ఏడాది కిందట సుమారు ఐదు వేల గృహాలకు నిరంతర నీటి సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు ముందు నార్త్ వెస్ట్ ప్రాంతంలోని నివాసాలకు ప్రతిరోజూ 55.96 కేఎల్‌డీ (కిలోలీటర్స్ పర్ డే) నీటి వినియోగం జరిగితే, ఈ ప్రాజెక్టు అమలు చేసిన తర్వాత 46.75 కేఎల్‌డీకి వినియోగం తగ్గిపోయింది. నిరంతర నీటి సరఫరా ప్రాజెక్టులో భాగంగా కొళాయిలకు మీటర్లు అమర్చడంతో ప్రజలు నీటిని వృథా చేయకుండా, అవసరం మేరకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆ విధంగా ఆదా అవుతున్న నీటిని జీవీఎంసీ పరిశ్రమలకు కిలోలీటర్ రూ.98 చొప్పున విక్రయిస్తోంది. అదేవిధంగా నార్త్,వెస్ట్ ఏరియాలో గతంలో నీటికొళాయిల చార్జీలు రూపంలో నెలకు రూ.7.89 లక్షలు ఆదాయం జీవీఎంసీకి వస్తే, ఇప్పుడు రూ.14.64 లక్షలకు పెరిగింది.
మధురవాడ ప్రాంతంలోని సుమారు 65 వేల నివాసాలకు నిరంతర తాగునీటి సరఫరా కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ద్వారా కేంద్ర ప్రభుత్వం జీవీఎంసీకి రూ.725.18 కోట్లతో ప్రాజెక్టు మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో యూసీఎఫ్ కింద రుణం రూపంలో 75 శాతం సమకూర్చితే, కేంద్ర ప్రభుత్వం 25 శాతం సమకూర్చుతుంది. నిరంతర నీటిసరఫరా ప్రాజెక్టు వల్ల వృఽథా తగ్గి మిగులుతున్న నీటిని పరిశ్రమలకు విక్రయించడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చునని జీవీఎంసీ యోచిస్తోంది. నార్త్‌వెస్ట్ ఏరియా, మధురవాడ ఏరియాలు పోను మిగిలిన ప్రాంతాలకు కూడా నిరంతర నీటి సరఫరా పనులు చేపట్టేందుకు మూడు నెలల్లో డీపీఆర్ తయారుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఏటా రూ.230 కోట్లు ఆదాయం పెరుగుదల
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
నగరమంతటికీ నిరంతర నీటిసరఫరా వ్యవస్థను అందుబాటులోకి తెస్తే ఏటా రూ.230 కోట్లు జీవీఎంసీ ఆదాయం పెరుగుతుంది. యూసీఎఫ్ ద్వారా నగరానికి మంజూరైన రూ.1,540 కోట్ల ప్రాజెక్టులకు రుణాన్ని వాయిదాల రూపంలో తీర్చడానికి ఆ మొత్తం సరిపోతుంది. ఇప్పటికే నార్త్‌వెస్ట్ ఏరియాలో నిరంతర నీటి సరఫరా జరుగుతోంది. త్వరలో మధురవాడ ఏరియాకు అందుబాటులోకి తెస్తున్నాం. మిగిలిన ఏరియాకు కూడా అమలుచేసేందుకు మూడు నెలల్లో డీపీఆర్ తయారుచేస్తాం. యూసీఎఫ్ రుణం తీర్చడానికి పరిశ్రమలకు విక్రయించే నీటి చార్జీలను కేటాయించుకోగలిగితే, ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా నగర అభివృద్ధికే కేటాయించుకునే వెసులుబాటు ఉంటుంది.