జడ్పీ పీఠంపై తొలగని ఉత్కంఠ
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:08 AM
ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకున్న విషయం విదితమే. మూడు పార్టీల మధ్య పొత్తులో భాగంగా టీడీపీ 17, జనసేన 5, బీజేపీ 2 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసి, అన్నిచోట్లా ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. అయితే బీసీ మహిళలకు రిజర్వు చేసిన జడ్పీ చైర్పర్సన్ పదవిని ఏ పార్టీకి కేటాయించాలన్న దానిపై ఆయా పార్టీల అధిష్ఠానాలు ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో టీడీపీ, జనసేనతోపాటు బీజేపీ జడ్పీటీసీలు కూడా చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నారు.
చైర్పర్సన్ పదవి రేసులో పది మందికిపైగా మహిళలు
ఎవరికివారే ముమ్మర ప్రయత్నాలు
అత్యధిక మండలాల్లో ఎంపీపీ పదవులకు అభ్యర్థుల గుర్తింపు
23 ఎంపీపీలు కూటమికే దక్కే అవకాశం
మునగపాకలో కూటమి, వైసీపీలకు చెరి సగం స్థానాలు
సభ్యులను కాపాడుకునేందుకు శిబిరాల నిర్వహణ
అనకాపల్లి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకున్న విషయం విదితమే. మూడు పార్టీల మధ్య పొత్తులో భాగంగా టీడీపీ 17, జనసేన 5, బీజేపీ 2 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసి, అన్నిచోట్లా ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. అయితే బీసీ మహిళలకు రిజర్వు చేసిన జడ్పీ చైర్పర్సన్ పదవిని ఏ పార్టీకి కేటాయించాలన్న దానిపై ఆయా పార్టీల అధిష్ఠానాలు ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో టీడీపీ, జనసేనతోపాటు బీజేపీ జడ్పీటీసీలు కూడా చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. బీసీ, అన్‌రిజర్వుడ్ స్థానాల్లో కూటమి తరపున పోటీ చేసి గెలుపొందిన బీసీ మహిళలు 12 మంది వున్నారు. వీరిలో సగానికిపైగా సభ్యులు చైర్పర్సన్ పీఠం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
సగానికిపైగా ఎంపీపీ పదవులకు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక
జిల్లాలో 427 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి 342 స్థానాలను కైవసం చేసుకుంది. వీటీలో తెలుగుదేశం 248, జనసేన 86, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందాయి. వైసీపీకి 74 స్థానాలు మాత్రమే దక్కగా, 11 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. వీరిలో 10 మంది కూటమి తిరుగుబాటు అభ్యర్థులు కావడం విశేషం. నామినేషన్ల సమయంలోనే జడ్పీటీసీ, ఎంపీపీ పదవులపై కూటమిలోని పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరింది. మునగపాక, అచ్యుతాపురం, అనకాపల్లి ఎంపీపీ పదవులను జనసేనకు విడిచిపెట్టి, మిగిలిన 21 ఎంపీపీ పదవులను టీడీపీ తీసుకోవాలని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతలు నిర్ణయించారు. కొన్ని వైస్ ఎంపీపీ పదవులను బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలిసింది. దీంతో అత్యధిక మండలాల్లో ఎన్నికలకన్నా ముందే ఎంపీపీ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన మండలాల్లో ఇద్దరు, ముగ్గురు ఎంపీపీ పదవులను ఆశిస్తూ.. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జిలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలిసింది. అయితే ఏ మండలంలో ఎవరు ఎంపీపీ అన్నదానిపై టీడీపీ, బీజేపీ జిల్లా నాయకత్వాలు ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం.
మునగపాకలో చెరిసగం ఎంపీటీసీ స్థానాలు
జిల్లాలో మునగపాక మినహా మిగిలిన అన్ని మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు కూటమికే దక్కుతాయి. మునగపాక మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకుగాను కూటమి ఎనిమిది (టీడీపీ 3, జనసేన 5), వైసీపీ ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో ఎంపీటీసీలు చేజారిపోకుండా ఇటు కూటమి, అటు వైసీపీ నాయకులు రహస్య శిబిరాలను ఏర్పాటు చేసిన, తమ సభ్యులను అక్కడకు చేర్చినట్టు చెబుతున్నారు.