రైల్వే జోన్‌పై ఇంకా నాన్చుడే
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:21 AM
విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఎప్పటి నుంచి ఆపరేషన్‌లోకి వస్తుందో రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టంగా వెల్లడించడం లేదు.
కార్యకలాపాల ప్రారంభంపై స్పష్టత కరువు
జోన్ నిర్మాణ పనులు, సిబ్బంది నియామకంపై లోక్‌సభలో రైల్వే మంత్రి ప్రకటన
‘గెజిట్’ ప్రస్తావన నిల్
అది విడుదలైతే ఇక్కడ ఆపరేషన్స్ మొదలయ్యేది
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఎప్పటి నుంచి ఆపరేషన్‌లోకి వస్తుందో రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టంగా వెల్లడించడం లేదు. జోన్ కార్యాలయం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జోన్‌కు అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకాలపై ఉత్తర్వులు వెలువడుతున్నాయి. అసలైన గెజిట్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడం లేదు. ఈ విషయంలో రైల్వే మంత్రిత్వ శాఖ కావాలనే జాప్యం చేస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా లోక్‌సభలో ఎంపీ ఒకరు విశాఖపట్నం రైల్వే జోన్ పరిస్థితి ఏమిటి?, కార్యాలయ నిర్మాణం ఎంత వరకు వచ్చిందని ప్రశ్నిస్తే...రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సుదీర్ఘ సమాధానం చెప్పారు. ముడసర్లోవలో నిర్మిస్తున్న కొత్త జోన్ కార్యాలయం పూర్తయ్యేవరకు సిరిపురంలోని వీఎంఆర్‌డీఏకి చెందిన ‘ది డెక్’’లో కార్యకలాపాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జోన్‌కు సంబంధించిన జనరల్ మేనేజర్‌ను, ఇతర ఉన్నతాధికారులను నియమించి, కంట్రోల్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కొత్త జోన్‌లోకి వెళ్లాలనుకుంటున్న సిబ్బందికి ఆప్షన్ కూడా ఇచ్చామని, ఇవన్నీ చురుగ్గా జరుగుతున్నాయని వివరించారు. ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కేంద్రం ప్రకటించిన జోన్ ఆపరేషన్‌లోకి రావాలంటే...ప్రత్యేకంగా ‘గెజిట్’ నోటిఫికేషన్ తప్పనిసరి. అందులోనే జోన్ పరిధి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొత్త జోన్ ఉంటుంది?, ఎన్ని కిలోమీటర్లు, డివిజన్లు, వాటి పరిధి, స్టేషన్లు, ఇతరత్రా వివరాలన్నీ ఉంటాయి. జోన్‌కు జనరల్ మేనేజర్ కీలక అధికారి. ఆయన ఆదేశాలనే అంతా పాటించాలి. జోనల్ డివిజనల్ మేనేజర్లు అంతా జీఎం కార్యాలయం ఇచ్చే సూచనలకు అనుగుణంగా నడుచుకుంటారు. విశాఖ విషయానికి వచ్చేసరికి కొత్త జీఎంగా సందీప్ మాధుర్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు దాటిపోయినా ఆయన ఆదేశాలు పాటించేందుకు ఏ డీఆర్‌ఎం సిద్ధంగా లేరు. కారణం...గెజిట్ టేకపోవడమే. దాంతో విశాఖ డీఆర్‌ఎం ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఆదేశాలను, గుంటూరు, గుంతకల్, విజయవాడ డీఆర్‌ఎంలు దక్షిణ మధ్య రైల్వే జీఎంల ఆదేశాలను పాటిస్తున్నారు. కొత్త జీఎం సమావేశాలు నిర్వహించగలుగుతున్నారు కానీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేపోతున్నారు. జోన్ పూర్తిస్థాయిలో నడవాలంటే గెజిట్ తప్పనిసరి. దానిని వెంటనే జారీ చేయాలని విశాఖ ఎంపీ శ్రీభరత్‌తో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడులు ఇప్పటికే చాలాసార్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. తొలుత దసరాకు నోటిఫికేషన్ వస్తుందని భావించారు. ఆ తరువాత సంక్రాంతి అనుకున్నారు. ఇప్పుడు ఉగాది కూడా అయిపోయింది. ఇంకెప్పుడు ఆ నోటిఫికేషన్ వస్తుందో అంతు చిక్కడం లేదు.
రైల్వే మంత్రి వెల్లడించిన వివరాలు...
- కూటమి ప్రభుత్వం వచ్చాక ముడసర్లోవలో 52.2 ఎకరాలను జోన్ కార్యాలయం నిర్మాణం కోసం రైల్వేకు అప్పగించింది.
- గత బడ్జెట్లలో కొత్త జోన్‌కు రూ.106.89 కోట్లు మంజూరయ్యాయి.
- 2025-26లో రూ.55 కోట్లు విడుదల కాగా అందులో రూ.32.31 కోట్లు ఖర్చు చేశారు. పనులు పునాదుల స్థాయి వరకు వచ్చాయి.
- సిబ్బందికి అవసరమైన ఇతర నిర్మాణాలు, గృహ సముదాయాల కోసం రూ.157.93 కోట్లు మంజూరయ్యాయి.