విశాఖ విమానాశ్రయం కొనసాగింపు?
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:53 AM
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత కూడా విశాఖలో విమానాశ్రయం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకేతాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకేతాలు
నగరంలో సుడిగాలి పర్యటన
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొక్క నాటిన సీఎం
అక్కడ నుంచి సైకిల్‌పై నోవాటెల్ హోటల్‌కు...
నగరంలో సైక్లింగ్, వాకింగ్‌కు ప్రత్యేకంగా ట్రాక్‌లు
సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల జాతీయ సదస్సుకు హాజరు
ఆక్వా ఎగుమతుల్లో ఏపీని నంబర్‌వన్‌గా నిలుపుతామని ప్రకటన
అనంతరం విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌పై సమీక్ష
బే సిటీగా విశాఖపట్నం తయారుకావాలి
ఆనందపురం మండలం జగన్నాథపురంలో భారీ కన్వెన్షన్ సెంటర్
త్వరలోనే విశాఖకు పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు
సంపద సృష్టికి కేంద్రంగా నగరాన్ని తయారుచేస్తామని ప్రకటన
విశాఖపట్నం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత కూడా విశాఖలో విమానాశ్రయం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకేతాలు ఇచ్చారు. నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం ప్రారంభమైన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో దిగారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల మైదానంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా మీడియాతో సీఎం మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బదింటోందన్నారు. ఒకవైపు విపరీతమైన ఎండలు కాస్తుండగా, మరోవైపు తుఫాన్‌లు సంభవిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాత్రం ప్రస్తుతం 25 శాతం గ్రీన్ కవరింగ్ (పచ్చదనం) మాత్రమే ఉందన్నారు. తిరుమల తరహాలో ఏయూ కూడా పచ్చదనం పెంపు కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుని 50 శాతం గ్రీన్ కవరింగ్‌ను సాధించాలని వైస్ చాన్సలర్ రాజశేఖర్‌ను సీఎం ఆదేశించారు. స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణానికి ఏయూ చిరునామా కావాలని ఆకాంక్షించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇంధన పొదుపు పాటించాలని పేర్కొంటూ అక్కడి నుంచి ముఖ్యమంత్రి సైకిల్ తొక్కుకుంటూ నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ సదస్సులో పాల్గొని సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు అన్నిరకాల ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్ అయితే దానికి ఏపీ కేంద్ర బిందువుగా వెలగాలన్నారు. రాష్ట్రంలో మెగా సీఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రోటీన్ ఉత్పత్తుల కోసం ఎదురుచూస్తున్నారని, ఆక్వా అభివృద్ధికి ఇదే సరైన తరుణమని ముఖ్యమంత్రి అన్నారు. ఆక్వా ఎగుమతుల్లో ఏపీని నంబర్ వన్‌గా నిలుపుతామన్నారు. లాజిస్టిక్స్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. సాయంత్రం సదస్సు ముగిసిన తరువాత హోటల్‌లో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బే సిటీగా విశాఖపట్నం తయారు కావాలన్నారు. ఇదంతా వీఈఆర్‌లో భాగంగా జరగాలని సూచించారు. ఆనందపురం మండలంలోని జగన్నాథపురంలో అందుబాటులో ఉన్న 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలన్నారు. కైలాసగిరిని ఆధ్యాత్మికంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేలా బీచ్ వాటర్ స్పోర్ట్స్‌తో పాటు వినోదం అందించే ప్రాజెక్టులకు పెట్టుబడులు రప్పించే ప్రయత్నాలు జరగాలన్నారు. వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూములపై చర్చించారు. మల్కాపురంలో వేదాంత గ్రూపు వద్ద ఉన్న 400 ఎకరాలు, వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ భూములు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విశాఖకు రెండు విమానాశ్రయాలు ఉంటాయని, అటు భోగాపురం, ఇటు విశాఖపట్నం రెండూ పనిచేస్తాయన్నారు. విశాఖపట్నాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చడానికి యత్నిస్తుంటే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం అనేక అవకాశాలకు కేంద్రంగా మారుతుందన్నారు. అనేక దేశాల నుంచి ఇక్కడ పనిచేసేందుకు, నైపుణ్యం కోసం వచ్చే పరిస్థితి ఉందన్నారు. పోలవరం పూర్తిచేసి ఎడమ కాలువ ద్వారా విశాఖకు త్వరలోనే నీరు అందిస్తామని చెప్పారు. విశాఖపట్నం సుందర నగరమే కాదని, సంపద సృష్టికి కేంద్రంగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నోవాటెల్ హోటల్‌లో జరిగిన సదస్సులో సీఎంతో పాటు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్ (వాణిజ్యం), కె.రామ్మోహన్‌నాయుడు (పౌర విమానయానం), రాజీవ్ రంజన్ సింగ్ (ఫిషరీస్), చిరాగ్ పాశ్వాన్ (ఫుడ్ ప్రాసెసింగ్), రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, సాంఘిక సంక్షేమ శాఖా డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు.
పచ్చదనం పెంపు కోసం కార్యాచరణ
ఏయూ వీసీకి సీఎం ఆదేశం
నెట్ జీరో విధానం అమలు చేయడానికి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లంతా బృందంగా ఏర్పడాలని సూచన
విశాఖపట్నం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
పచ్చదనం పెంపు కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుని 50 శాతం గ్రీన్ కవరింగ్‌ను సాధించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి మొక్కను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏయూకు 450 ఎకరాల విశాలమైన క్యాంపస్ ఉదని, ఖాళీ ప్రదేశంలో చెట్లు పెంచాలన్నారు. అలాగే భవనాల మీద సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేసుకుని విశ్వవిద్యాలయానికి కావాల్సిన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలన్నారు. ఏయూను బయో డైవర్సిటీ పార్కుగా తీర్చిదిద్దాలని వీసీకి సూచించారు. క్యాంపస్‌లో చెత్త, చెట్ల ఆకులను కంపోస్ట్‌గా మార్చాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వేస్ట్ టు ఎనర్జీప్లాంట్, వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. క్యాంపస్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు వెళ్లకుండా ఇంకుడుగుంతలు, సంపులు నిర్మించుకుని, శుద్ధి చేసిన నీటిని చెట్లకు ఉపయోగించాలని సూచించారు. పీఎన్‌జీ, ఎలక్ర్టిక్ స్టవ్‌లను వంటలకు వినియోగించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. నెట్ జీరో విధానం అమలు చేయడానికి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లంతా బృందంగా ఏర్పడాలని సీఎం సూచించారు. పర్యావరణానికి ఏయూ ఒక నాలెడ్జ్ హబ్‌గా తయారుకావాలన్నారు. ప్రపంచంలో టాప్ నాలెడ్జ్ వర్సిటీల సరసన ఏయూను నిలపాలని అందులో భాగంగా క్యాంపస్‌లో ఈ-సైకిళ్లను అందుబాటులోకి తేవాలని సూచించారు. విశాఖలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పోర్టు మొదలుకుని అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చంద్రబాబునాయుడు చెప్పారు.