Share News

మేయర్‌ సీటుకు పోటీ

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:56 AM

జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థులెవరనే చర్చ రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా నడుస్తోంది.

మేయర్‌ సీటుకు పోటీ

  • రిజర్వేషన్‌ ఖరారైతే ఒక కొలిక్కి వచ్చే అవకాశం

  • కూటమి నుంచి భారీగా ఆశావహులు

  • టీడీపీ, బీజేపీ, జనసేనల నుంచి ప్రచారంలో పలువురి పేర్లు

  • ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన సమన్వయ కమిటీ

  • వైసీపీ అభ్యర్థి ఎంపిక కోసం సమావేశమైన ఆ పార్టీ ముఖ్య నేతలు

  • మరోవైపు ఎన్నికల ఏర్పాట్లలో జీవీఎంసీ అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థులెవరనే చర్చ రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా నడుస్తోంది. మేయర్‌ పదవికి రిజర్వేషన్‌ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే రిజర్వేషన్‌, అభ్యర్థులపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ మేయర్‌ అభ్యర్థి ఎంపికపై వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి.

జీవీఎంసీ మేయర్‌ను గతంలో మాదిరిగా కార్పొరేటర్లు కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ మునిసిపల్‌ చట్టానికి సవరణలు చేసింది. రాష్ట్రంలోనే అతిపెద్ద నగర పాలక సంస్థ, రూ.4,400 కోట్లకు పైబడిన వార్షిక బడ్జెట్‌, ఎనిమిది నియోజక వర్గాలకు విస్తరించిన జీవీఎంసీ మేయర్‌ మేయర్‌ పదవి కోసం రాజకీయంగా, ఆర్థికంగా గట్టిపట్టున్న నేతలు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కూటమి తరపున పోటీకి దిగే వారికి విజయావకాశాలు మెండుగా ఉండడంతో మేయర్‌ అభ్యర్థిత్వం ఆశించే వారి సంఖ్య టీడీపీ, జనసేన, బీజేపీల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో కూటమి పార్టీలను ఏకతాటిపై నడిపేందుకు వీలుగా ఇప్పటికే ఎంఎల్‌సీ షరీఫ్‌ను పరిశీలకుడిగా నియమించారు. షరీఫ్‌ ఆధ్వర్యంలో మూడు పార్టీల నుంచి కొందరు నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటుచేసి, టికెట్ల పంపిణీ, అభ్యర్థుల ఎంపికపై సమన్వయంతో ముందుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. ఆ మేరకు సమన్వయ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై జీవీఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేయర్‌ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేసినట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదివారం ప్రకటించడంతో వేడి పెరిగింది. ఎవరు పోటీకి దిగుతారనే దానిపై విశ్లేషణలు చేయడం ప్రారంభించారు.

మేయర్‌ పదవితోపాటు 120 వార్డుల రిజర్వేషన్‌ త్వరలో ఖరారయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించి వారి వివరాలను అన్ని వార్డులు, జోనల్‌ కార్యాలయాల్లో ఏర్పాటుచేశారు. వాటిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈనెల 30 వరకు అవకాశం కల్పించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే రిజర్వేషన్‌లను ప్రకటించి, ఎన్నికలకు షెడ్యూల్‌ కూడా జారీచేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సోమవారం హడావిడిగా సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతోపాటు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలంతా సమావేశమై జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై చర్చించారు. ఓసీ అయితే ఎవరు?, బీసీ జనరల్‌ అయితే ఎవరిని దింపాలి?, బీసీ మహిళ అయితే ఎవరిని నిలపాలి?...అనే దానిపై మూడేసి పేర్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అలాగే నియోజవర్గాల వారీగా వార్డుకు ఒకరు లేదా ఇద్దరు చొప్పున పేర్లతో జాబితాను సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు. ఆయా జాబితాలపై మరోసారి నేతలు, ముఖ్య కార్యకర్తలు సమావేశమై చర్చించి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే పేర్లు ప్రకటించాలని సమన్వయ సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిసింది.

భారీగా ఆశావహులు

జీవీఎంసీ మేయర్‌ పదవికి కూటమి పార్టీల నుంచి భారీగా ఆశావహులు పోటీపడుతున్నారు. మేయర్‌ సీటు...బీసీ జనరల్‌ అయితే తెలుగుదేశం పార్టీ తరపున తమకు అవకాశం ఇవ్వాలని ఏపీ కో-ఆపరేటివ్‌ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గండి బాబ్జీ, రాష్ట్ర మునిసిపల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవిందసత్యనారాయణ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కుమారుడు, దాడి రత్నాకర్‌, పక్కుర్తి మురళీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, గాజువాక ఎమ్మెల్యే బంధువు, మాజీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, ఒమ్మి సన్యాసిరావు, కోరాడ రాజబాబు కోరుతున్నారు. బీసీ మహిళకు కేటాయిస్తే భీమిలి మునిసిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌ గాడు చిన్నికుమారిలక్ష్మి, మాజీ కార్పొరేటర్‌ బొట్టా రమణ కుమార్తె, అక్కరమాని అప్పలనాయుడు కోడలు అయిన బొట్టా ప్రసన్నభార్గవి, మాజీ కార్పొరేటర్‌ మొల్లి హేమలత, గొలగాని మంగవేణి తమకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞాపనలు పంపించారు. అదే ఓసీ అయితే...వీరందరితోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చోడె పట్టాభిరాం, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ, మాజీ కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు మేయర్‌ సీటు ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కుమార్తె దీపిక, సెయిల్‌ డైరెక్టర్‌ కాశీవిశ్వనాథరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ సతీమణి రేస్‌లో ఉన్నట్టు తెలిసింది. జనసేన నుంచి ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్‌ సతీమణి, పసుపులేటి ఉషాకిరణ్‌ ఆశిస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఓసీ అయితే కాయల వెంకటరెడ్డి, కేకే రాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీసీ అయితే మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, తిప్పల గురుమూర్తిరెడ్డి, తైనాల విజయ్‌కుమార్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ ఆశిస్తున్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:56 AM