Share News

మోపెడ్‌ను ఢీకొన్న కంటైనర్‌ లారీ

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:44 AM

మోపెడ్‌ను ఢీకొన్న కంటైనర్‌ లారీ

మోపెడ్‌ను ఢీకొన్న   కంటైనర్‌ లారీ
నాగలక్ష్మి (ఫైల్‌ ఫొటో)

మహిళ దుర్మరణం

స్వల్ప గాయాలతో బయటపడిన భర్త

నక్కపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జాతీయ రహదారిపై మోపెడ్‌ను కంటైనర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

నక్కపల్లి హైవేపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందారు.

నక్కపల్లి మండలం డీఎల్‌పురం గ్రామనికి చెందిన కె.అప్పలనాయుడు, నాగలక్ష్మి (36) భార్యాభర్తలు. ఆమె స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిగా పనిచేస్తున్నది. ఆదివారం ఉదయం ఎస్‌.రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లిలో సమీప బంధువుల ఇంటిలో జరిగిన ఫంక్షన్‌కు భార్యాభర్తలు మోపెడ్‌పై వెళ్లారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత తిరిగి డీఎల్‌పురం బయలుదేరారు. రహదారికి పూర్తిగా ఎడమవైపున వీరు ప్రయాణిస్తున్నారు. నక్కపల్లి వద్ద ట్రాలర్‌ లారీని ఎడమ వైపు నుంచి కంటైనర్‌ లారీ ఓవర్‌ టేక్‌ చేస్తున్నది. ఈ క్రమంలో అప్పలనాయుడు, నాగలక్ష్మి ప్రయాణిస్తున్న మోపెడ్‌ను కంటైనర్‌ లారీ ఢీకొన్నది. దీంతో నాగలక్ష్మి కింద పడిపోవడం, ఆమె మీద నుంచి లారీ టైర్లు వెళ్లడం రెప్పపాటులో జరిగిపోయాయి. అప్పలనాయుడు స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. కళ్లెదుటే భార్య శరీరం మీదుగా లారీ దూసుకెళ్లడంతో అతను షాక్‌కు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి.. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ లారీని పట్టుకొన్నారు. ప్రమాద వార్త తెలుసుకొని మృతురాలి ఇద్దరు కుమార్తెలు ఇక్కడకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. సీఐ మురళీ పర్యవేక్షణలో ఎస్‌ఐ అంజుమా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:44 AM