మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణం వేగవంతం
ABN , Publish Date - May 12 , 2026 | 01:18 AM
భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ చేపట్టిన మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణం అనుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ సూచించారు.
ఇప్పటికే మూడు పూర్తి
వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్
విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):
భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ చేపట్టిన మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణం అనుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ సూచించారు. కమిషనర్ తేజ్‌భరత్, సీఈ వినయకుమార్‌లతో కలిసి సోమవారం ఆయన నేరెళ్లవలస-తాళ్లవలస రహదారి పనులను పరిశీలించారు. పనులు వేగంగా చేసే క్రమంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. రాజీ లేకుండా పూర్తి నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. తొలుత ఏడు మాస్టర్‌ప్లాన్ రహదారులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవగా ఇప్పటివరకు మూడు రోడ్లు పూర్తయ్యాయని, మిగిలిన రహదారులు జూన్‌లో పూర్తిచేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ మధుసూదనరావు, ఈఈ దుర్గాప్రసాద్, డీఈ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఏపీఈఏపీసెట్
జిల్లాలో 33,534 మంది విద్యార్థులు
11 కేంద్రాలు ఏర్పాటు
ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు
గంటన్నర ముందు పరీక్ష కేంద్రంలోకి అనుమతి
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈనెల 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరగనున్న పరీక్షలకు జిల్లాలో 11 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇంజనీరింగ్ కోర్సులకు 25,230 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 8,236మంది, ఇంజనీరింగ్/ఫార్మసీ కోర్సులకు 68 మంది...మొత్తం 33,534 మంది దరఖాస్తు చేసుకున్నారు.
విద్యార్థులను గంటన్నర ముందు పరీక్షల హాలులోకి అనుమతిస్తారు. ఉదయం తొమ్మిది గంటలు, మధ్యాహ్నం రెండు గంటల తరువాత అభ్యర్థులను హాలులోకి అనుమతించరు. మధురవాడలోని గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల, కొమ్మాదిలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాల, రుషికొండలో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, దువ్వాడలో విజ్ఞాన్ కళాశాల, విజ్ఞాన్ మహిళా కళాశాల, నరవలోని విశాఖ ఇంజనీరింగ్ కళాశాల, బక్కన్నపాలెంలో బాబా ఇంజనీరింగ్ కళాశాల, పెదగంట్యాడలోని ఎస్‌వీఎస్ టెక్నాలజీ, షీలానగర్‌లోని ఐయాన్ డిజిటల్, చినముషిడివాడలో ఐయాన్ డిజిటల్ కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
అనధికార విద్యుత్ కోతలు
మధురవాడ, ఆనందపురం, ఆటోనగర్, గోపాలపట్నాల్లో రాత్రి వేళ కూడా సరఫరా నిలిపివేత
అటువంటిదేమీ లేదంటున్న అధికారులు
విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. వేసవి ఎండలు మండిపోవడంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు సామర్థ్యాన్ని తట్టుకోలేక ట్రిప్ అవుతున్నాయి. వాటిని సరిచేసేసరికి సమయం పడుతోంది. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి అధికారులు చెప్పాపెట్టకుండా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారు. మధురవాడ, ఆనందపురం, ఆటోనగర్, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో రాత్రి సమయంలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మధురవాడలో అయితే పగటి పూట కూడా విద్యుత్ తీసేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. నిర్వహణ పనులు అని, లైన్ మరమ్మతులు అని అధికారులు చెబుతున్నారు. కానీ డిమాండ్‌ను తట్టుకోలేక లోడ్ రిలీఫ్ కోసమే ఇలా అనధికారి కోతలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే...ఇంకా తీవ్రమైన ఎండలు ముందున్నాయని, అప్పుడు కోతలు పెడితే కష్టమని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.