పేదల ఇళ్ల నిర్మాణానికి బ్రేక్
ABN , Publish Date - May 11 , 2026 | 12:59 AM
పేదల కోసం నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో ఆప్షన్-3 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది.
చాలాచోట్ల పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
పీఎంఏవై పథకం కింద చేపట్టిన నిర్మాణాల పూర్తికి ముగిసిన గడువు
మిగిలిన నిధులు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్న కేంద్రం
ఈ దశలో పనులు చేసినా బిల్లులు రావని కాంట్రాక్టర్ల వెనుకంజ
పట్టించుకోని హౌసింగ్ అధికారులు
సొంతింటి కల సాకారమయ్యేనా?
విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి):
పేదల కోసం నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో ఆప్షన్-3 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. బిల్లులకు గ్యారంటీ లేదనే వదంతులు రావడంతో చాలా కాలనీల్లో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. హౌసింగ్ అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ శివారు ప్రాంతాల్లో 73 లేఅవుట్‌లలో 1.1 లక్షల మందికి సెంటు భూమిలో ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చారు. పలు కారణాలతో 85 వేల ఇళ్ల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇంటి నిర్మాణానికి పీఎంఏవై పథకం కింద మంజూరైన రూ.1.5 లక్షలకు అదనంగా రాష్ట్రం రూ.30 వేలు మంజూరుచేసింది. ఈ పథకంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్-1లో లబ్ధిదారుడు స్వయంగా ఇల్లు నిర్మించుకోవడం. ఆప్షన్-2 కింద ప్రభుత్వం మెటీరియల్ ఇస్తే లబ్ధిదారుడు ఇల్లు పూర్తిచేసుకోవడం. ఆప్షన్-3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వడం. ఆప్షన్-3 ఎంచుకున్న లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం అనధికారికంగా కాంట్రాక్టర్లను అప్పగించింది. బిల్లుల్లో ఇబ్బంది లేకుండా లబ్ధిదారుడు-బ్యాంకు-కాంట్రాక్టర్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం లబ్ధిదారుడి ఖాతాకు వచ్చే నగదును బ్యాంకు అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ ఖాతాకు జమ చేయాలి. అయితే మొదటి నుంచి అనుకున్న మేర పనులు జరగలేదు సరికదా కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై మెటీరియల్ విక్రయించేసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పలుమార్లు పథకం పురోగతిపై సమీక్షించినా క్షేత్రస్థాయిలో హౌసింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల వైఫల్యంతో ఇళ్ల నిర్మాణంలో అనుకున్న ప్రగతి కనిపించలేదు. దీంతో గత ఏడాది ఆరు నెలలపాటు బిల్లులు నిలిపివేశారు. చివరకు సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ ఏడాది జనవరిలో బిల్లులు మంజూరుచేసింది. ఆ తరువాత లేఅవుట్‌లలో పనులు అనుకున్నమేర సాగలేదు.
ఇదిలావుండగా పీఎంఏవై పథకం గత ఏడాది డిసెంబరు 31తో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. ఆ తరువాత చేపట్టిన పనులకు బిల్లుల మంజూరులో గ్యారంటీ ఇవ్వలేమని ఉన్నతాధికారులు చెప్పడంతో కాంట్రాక్టర్లు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వారు తప్ప మిగిలిన వారంతా పనులు నిలిపివేశారు. గత నెలాఖరు నాటికి మొత్తం లేఅవుట్‌లలో 85 వేల ఇళ్లలో సుమారు 40 వేల పూర్తిచేయగా, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో చాలావరకు పునాదుల్లో ఉండిపోయారు. పీఎంఏవై కింద ఇచ్చిన నిధులలో ఇంకా మిగిలిన రూ.170 కోట్లను వెంటనే వెనక్కి పంపాలని కేంద్రం ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ విషయం అధికారుల ద్వారా తెలుసుకున్న కాంట్రాక్టర్లు పనులు కొనసాగించడానికి వెనుకంజ వేశారు. ఆ రూ.170 కోట్లు వెనక్కి ఇస్తే బిల్లులు వచ్చే అవకాశం లేదని పనులు నిలిపివేశారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు ప్రారంభింపజేసేందుకు హౌసింగ్ ఉన్నతాఽధికారులు చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు లబ్ధిదారులు మధ్యలో నిలిచిన తమ ఇల్లు చూసి ఆందోళన చెందుతున్నారు. పాలకులు జోక్యంచేసుకుని ఆప్షన్-3 కింద చేపట్టిన ఇళ్లను పూర్తి చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.