Share News

బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో బరితెగింపు

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:22 PM

జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో భాగంగా జిల్లా కేంద్రం పాడేరుకు నిర్మిస్తున్న బైపాస్‌ రోడ్డు పనుల్లో భూ బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా హైవే అథారిటీ అధికారులు బరితెగింపుగా పనులు చేస్తుండడం వివాదస్పదమైంది.

బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో బరితెగింపు
హుకుంపేట మండలం సన్యాసమ్మపాలెంలోని వివాదస్పద భూమిలో బైపాస్‌ రోడ్డు నిర్మిస్తున్న దృశ్యం

భూ బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండానే రోడ్డు నిర్మాణం

న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు

పాడేరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో భాగంగా జిల్లా కేంద్రం పాడేరుకు నిర్మిస్తున్న బైపాస్‌ రోడ్డు పనుల్లో భూ బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా హైవే అథారిటీ అధికారులు బరితెగింపుగా పనులు చేస్తుండడం వివాదస్పదమైంది. దీనికి సంబంధించి భూ బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పాడేరుకు బైపాస్‌ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో హుకుంపేట మండలం సన్యాసమ్మపాలెం ప్రాంతంలో నలుగురు గిరిజనులకు సంబంధించి భూ నష్టపరిహారం అందలేదు. దీంతో తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే తమ భూముల్లో రోడ్డు పనులు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తమ సమస్యపై మీకోసం ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థలో సైతం ఫిర్యాదు చేశారు. కాగా బుధవారం రాత్రి నుంచి అధిక సంఖ్యలో లారీలు, యంత్రాలను వినియోగించి సదరు భూమిలో రోడ్డు పనులు చేసేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు రోడ్డు పనులు ఆపాలని, తమకు భూ నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలని, రాత్రికి రాత్రి పనులు చేపట్టడం అన్యాయమని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళితే, రోడ్డు పనులు ప్రారంభించారు కాబట్టి ఆపవద్దని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా రాత్రికి రాత్రి తమ భూముల్లో రోడ్డు వేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకుంటే అదే రోడ్డుపై టెంట్‌లు వేసి నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:22 PM