Share News

పడకేసిన ఇళ్ల నిర్మాణం

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:42 AM

జిల్లాలో బలహీనవర్గాల గృహ నిర్మాణాలు ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కు.. అన్న తీరున సాగుతున్నాయి.

పడకేసిన ఇళ్ల నిర్మాణం

గడువు దాటినా.. లక్ష్యాన్ని చేరుకోని వైనం

గత ప్రభుత్వ హయాంలో పేదలకు 62,488 ఇళ్లు మంజూరు

నిర్మాణం పూర్తయ్యింది 18,500 ఇళ్లు మాత్రమే

మిగిలిన 43,948 ఇళ్లల్లో తొలివిడత 13,687 నివాసాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వ లక్ష్యం

గడువు ముగిసి నాలుగు నెలలైనా అసంపూర్తిగా 4,167 ఇళ్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో బలహీనవర్గాల గృహ నిర్మాణాలు ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కు.. అన్న తీరున సాగుతున్నాయి. ఫలితంగా పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై, అసంపూర్తిగా వున్న 43,948 ఇళ్లలో గత ఏడాది అక్టోబరు నెలాఖరులోగా 13,687 ఇళ్లను పూర్తి చేయాలని నియోజకవర్గా వారీగా లక్ష్యాలను పెట్టుకున్నారు. కానీ ఇంతవరకు 9,520 గృహ నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి.

గత వైసీపీ పాలకులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 608 లేఅవుట్లు వేసి, ఇళ్లు లేని వారికి సెంటు చొప్పున అందజేశారు. ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన నిధులు చాలకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను మధ్యలో ఆపేశారు. వైసీపీ హయాంలో 62,488 గృహాలు మంజూరుకాగా, ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి 18,500 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తియ్యాయి. 43,948 గృహాలు అసంపూర్తిగా వుండిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. అంతేకాక ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేల చొప్పున అదనంగా ఆర్థిక సాయం అందించింది. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. మొత్తం 43,948 ఇళ్లలో 13,687 ఇళ్లను 2025 అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ ఎక్కడా అనుకున్న మేర పనులు జరగడంలేదు. గడువు ముగిసి నాలుగు నెలలు దాటినప్పటికీ ఇంతవరకు 9,520 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 4,167 ఇళ్ల పనులు కొంతమేర జరిగి, ఆగిపోయాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. అనకాపల్లిలో 2,754 ఆసంపూర్తి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంకాగా 1,635 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. చోడవరంలో 1,649 ఇళ్లనుగాను 1,209 ఇళ్లు, మాడుగులలో 2,090 ఇళ్లకు 1,638 ఇళ్లు, నర్సీపట్నంలో 2,404 ఇళ్లకుగాను 1,829 ఇళ్లు, పాయకరావుపేటలో 2,988 ఇళ్లకుగాను 2,112 ఇళ్లు, ఎలమంచిలిలో 1,212 ఇళ్లకుగాను 768, పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం మండలాల్లో 580 ఇళ్లకుగాను 329 ఇళ్లు పూర్తయ్యాయి. చాలాచోట్ల లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంం, గృహ నిర్మాణ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి, లక్ష్యంమేరకు పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని కూటమి పార్టీలకు చెందిన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 01:42 AM