Share News

వివాదాస్పద స్థలంలో భవన నిర్మాణం

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:32 AM

జీవీఎంసీకి, ప్రైవేటు వ్యక్తికి మధ్య వివాదం నడుస్తున్న అత్యంత విలువైన స్థలంలో జనసేన పార్టీకి చెందిన చోటా నేత ఒకరు భవన నిర్మాణం ప్రారంభించారు.

వివాదాస్పద స్థలంలో భవన నిర్మాణం

ఆ స్థలం తమదంటూ గతంలో హోటల్‌ పార్కింగ్‌కు లీజుకు ఇచ్చిన జీవీఎంసీ

ఇప్పుడు ప్రైవేటు స్థలంగా పేర్కొంటూ పనులు

సమాచారం తెలిసి అడ్డుకున్న అధికారులు

స్థల యజమాని వద్ద తాను డెవలప్‌మెంట్‌కు తీసుకున్నానన్న జనసేన స్థానిక నేత

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీకి, ప్రైవేటు వ్యక్తికి మధ్య వివాదం నడుస్తున్న అత్యంత విలువైన స్థలంలో జనసేన పార్టీకి చెందిన చోటా నేత ఒకరు భవన నిర్మాణం ప్రారంభించారు. సమాచారం అందుకున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అక్కడకు వెళ్లి పనులు నిలిపివేయించారు.

ద్వారకా నగర్‌లో కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ 1951లో లేఅవుట్‌ వేసింది. ప్రస్తుతం బాయ్‌లండన్‌ షోరూమ్‌ వెనుక వైపు గల 331 గజాలు (ప్లాట్‌ నంబర్‌ 135/సీ) స్థలం అందులోనిదే. అది జీవీఎంసీకి దఖలు పడిందంటూ అధికారులు కొంతకాలం కిందట వరకు బుదిల్‌ పార్క్‌ హోటల్‌కు పార్కింగ్‌ కోసం లీజుకు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందోగానీ లీజు రద్దు అయింది. అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగానే ఉండడంతో దుర్గా దేవీనవరాత్రుల ఉత్సవాలను జరుపుతుండేవారు. ఇదిలావుండగా ఆ స్థలంలో జనసేన పార్టీకి చెందిన చోటానేత ఒకరు భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. దీనిపై టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు కొందరు సమాచారం ఇవ్వడంతో బుధవారం అధికారులు అక్కడకు వెళ్లి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఆ స్థలంలో పనులు చేస్తున్నది తానేనని, నిర్మాణం ఎందుకు ఆపుతున్నారని మాజీ కార్పొరేటర్‌ భర్త రాజు ప్రశ్నించారు. ఆ స్థలం జీవీఎంసీకి చెందినదని, టైటిల్‌పై వివాదం ఉన్నందున పనులు చేయడానికి వీల్లేదని స్పష్టంచేశారు. తాను ఆ స్థలాన్ని అచ్యుతరామయ్య అనే వ్యక్తి నుంచి డెవలప్‌మెంట్‌కు తీసుకున్నానని, జీవీఎంసీ ఆ స్థలాన్ని లీజుకు ఇవ్వడంతో కోర్టుకు వెళ్లి యాజమాన్య హక్కులను ఆయన గెలుచుకున్నారని రాజు వివరించారు. అయితే దానికి సంబంఽధించిన పత్రాలను ఉన్నతాధికారులకు చూపించి వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పి టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం టౌన్‌ప్లానింగ్‌ అధికారుల వద్ద ప్రస్తావించగా ఆ స్థలం జీవీఎంసీకి చెందినదిగా తమ రికార్డుల్లో ఉందని, ఒకవేళ వారికి యాజమాన్య హక్కులు ఉంటే చూపిస్తే పనులు చేపట్టేందుకు అనుమతిస్తామన్నారు. లేఅవుట్‌లో స్థలం కావడంతో లైసెన్స్‌ సర్వేయర్‌ సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ద్వారా జీవీఎంసీ నుంచి ప్లాన్‌ పొందారని వివిరించారు. ఆ స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు తీసుకున్నట్టు చెబుతున్న మాజీ కార్పొరేటర్‌ భర్త రాజుని వివరణ కోరగా, ఆ స్థలంలో గతంలో ఇల్లు ఉండేదని, అందులో తాను అద్దెకు ఉండేవాడినన్నారు. తాజాగా ఆ స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు తీసుకుని నిర్మాణం చేస్తున్నానని, ఆ స్థలం యాజమాన్య హక్కులపై జీవీఎంసీ అధికారులు అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 01:32 AM