Share News

కలగానే వంతెన నిర్మాణం

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:32 PM

మండలంలోని భీంపోల్‌ పంచాయతీ శివారులో ఉన్న రామచంద్రపురం గెడ్డపై వంతెన నిర్మాణానికి 2022లో గత ప్రభుత్వం సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే ఐదుసార్లు వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురాలేదు.

కలగానే వంతెన నిర్మాణం
ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న రామచంద్రపురం గెడ్డ

రామచంద్రపురం గెడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం నిధులు మంజూరు

ఐదుసార్లు టెండర్లు పిలిచినా ముందుకురాని కాంట్రాక్టర్లు

గడువు ముగియడంతో మురిగిపోయిన నిధులు

అనంతగిరి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా ఉంది రామచంద్రపురం గిరిజనుల పరిస్థితి. మండలంలోని భీంపోల్‌ పంచాయతీ శివారులో ఉన్న రామచంద్రపురం గెడ్డపై వంతెన నిర్మాణానికి 2022లో గత ప్రభుత్వం సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే ఐదుసార్లు వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. గడువులోగా పనులు ప్రారంభంకాకపోవడంతో నిధులు మురిగిపోయాయి. దీంతో పలు గ్రామాల గిరిజనులకు నిరాశే ఎదురైంది.

రామచంద్రపురం గెడ్డ మీదుగా సరియాపల్లి, రామచంద్రపురం, రాళ్లగెడ్డ గ్రామాలతో పాటు గుమ్మకోట పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాలు పడినప్పుడు ఈ గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో గిరిజనులు ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తుంటారు. గత ఏడాది నిండు గర్భిణిని కుటుంబ సభ్యులు రామచంద్రపురం గెడ్డ దాటించి భీమవరం పీహెచ్‌సీకి తరలించారు. ప్రసవం అనంతరం స్వగ్రామానికి తరలించే క్రమంలో అతికష్టమ్మీద బాలింతను, తల్లిని గెడ్డ దాటించి స్వగ్రామమైన రామచంద్రపురం తీసుకువచ్చారు. ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి.

ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా 2022లో గత ప్రభుత్వం సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో గిరిజన సంక్షేమశాఖ అధికారులు వంతెన నిర్మాణానికి ఐదుసార్లు టెండర్లు పిలిచారు. అయితే గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయదని తెలిసి కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. గడువులోగా పనులు ప్రారంభంకాకపోవడంతో ఆ నిధులు మురిగిపోయాయి. నిధులు మంజూరు కావడంతో వంతెన నిర్మాణం పూర్తవుతుందని ఆశ పడ్డ గిరిజనులకు నిరాశే మిగిలింది. తమకు ఎన్నాళ్లీ కష్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 11:32 PM