Share News

ఉపాధి హామీ చట్టాన్నినీరుగార్చే కుట్ర

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:14 PM

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధిని కల్పించేందుకు తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

ఉపాధి హామీ చట్టాన్నినీరుగార్చే కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

మెడికల్‌ కళాశాలలో పీపీపీ విధానం వెనక్కి తీసుకోవాలి

తిరుపతి లడ్డూ కల్తీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన రామకృష్ణ

పాడేరురూరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధిని కల్పించేందుకు తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే కుట్ర చేస్తున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం అల్లూరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ప్రైవేటు అతిథిగృహంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2005లో వామపక్ష ఉద్యమాలతో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం సాధారణ సంక్షేమ పథకంగా మార్చే ప్రయత్నం చేయడాన్ని ఆయన ఖండించారు. వ్యవసాయ కూలీలకు కనీసం 200 రోజులు పని దినాలను కల్పించాలని, ఆదివాసీ ప్రాంతంలో కూలీ రేట్లు పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడపాలని, పీపీపీ విధానాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగినట్టు తేలిన నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. తొలుత జిల్లా కలెక్టర్‌ను కలిసి గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వినతిపత్రం అందించారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల సమస్యలను గుర్తించి రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, స్కూల్‌ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ను కోరారు. అనంతరం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు కె.రాధాకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతురాజు, దేవుళ్లు, సింహాచలం, కుమార్‌, కృష్ణ, కృష్ణవేణి ఉన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 11:14 PM