డోలీ గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:42 PM
గిరిజన ప్రాంతంలో డోలీ గ్రామాలకు కనెక్టివిటీ రహదారులు నిర్మిస్తున్నామని పాడేరు పంచాయతీరాజ్ డీఈఈ కె.జ్యోతిబాబు తెలిపారు. శుక్రవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆయన పర్యటించారు.
రూ.65 కోట్లతో నిర్మాణం
పీఆర్ డీఈఈ జ్యోతిబాబు
చింతపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో డోలీ గ్రామాలకు కనెక్టివిటీ రహదారులు నిర్మిస్తున్నామని పాడేరు పంచాయతీరాజ్ డీఈఈ కె.జ్యోతిబాబు తెలిపారు. శుక్రవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆయన పర్యటించారు. నూతనంగా నిర్మించిన దామనాపల్లి తారు రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గం పరిధిలో కనీస రహదారి సదుపాయంలేని 80 గ్రామాలను కలుపుతూ రూ.65 కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 61 డబ్ల్యూబీఎన్ కనెక్టివిటీ రోడ్లు నిర్మించామన్నారు. ఈ రహదారులు అందుబాటులోకి రావడం వల్ల చాలా గ్రామాలకు డోలీమోతలు తప్పాయన్నారు. అలాగే పాడేరులో డల్లాపల్లికి 7.5 కిలోమీటర్లు రూ.4.2 కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో తారు రోడ్డు నిర్మించామన్నారు. చింతపల్లిలోని ఎ.శనివారంలో ఐదు కిలోమీటర్లు రూ.2.5 కోట్లుతో, జీకేవీధిలోని లింగవరం-లంకవీధిలో ఐదు కిలోమీటర్లు రూ.2.5 కోట్లు, జి.మాడుగులలో 29 కిలోమీటర్లు యాభై గ్రామాలను కలుపుతూ రూ.40కోట్లతో తారు రోడ్లు నిర్మించామని చెప్పారు. అలాగే పీఎం జన్‌మన్ నిధులతో నియోజకవర్గంలో తొమ్మిది అంగన్‌వాడీ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. చింతపల్లిలో ఐదు భవనాలు పూర్తి చేశామన్నారు. ఒక్కొక్క భవనానికి రూ.12 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. పాడేరులో రూ.రెండు కోట్ల నిధులతో జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం నిర్మిస్తున్నామన్నారు. 2026-27 వార్షిక సంవత్సరంలోనూ ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈఈ బాలకిశోర్ పాల్గొన్నారు.