ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:12 AM
దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్న కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధికి అడ్డుపడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు అన్నారు.
దేశాభివృద్ధిని అడ్డుకోవడమే ఆ పార్టీ ధ్యేయం
తల్లీపిల్ల కాంగ్రెస్‌తో ప్రజలకు నష్టం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
కాంగ్రెస్‌ది దిగజారుడుతనం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూటమి నేతల నిరసన
సిరిపురం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):
దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్న కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధికి అడ్డుపడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు అన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూటమి నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ లాంటి దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థల పెద్దలు పాల్గొన్న ఏఐ సిమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సిగ్గు చేటన్నారు. నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కానీ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏఐ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేయడం దారుణమన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీని దెబ్బతీశామని అనుకుంటే పొరపాటని, ఇది భారతీయుల ఏఐపై ప్రపంచ వ్యాప్తంగా చర్చసాగుతోందని, దీనికి మన దేశమే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. విశాఖ పట్నం ఏఐకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. దేశంలో తల్లి కాంగ్రెస్, రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకమని, దీనిని ప్రజలంతా గమనించాలన్నారు. భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేయాలనే కాంగ్రెస్ పార్టీ చర్యలను తిప్పికొడతామన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఐక్యంగా ముందుకు వెళ్తున్నాయన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా కాంగ్రెస్ పార్టీ దిగుజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. గూగుల్ సెంటర్‌తో విశాఖపట్నం ప్రపంచంలో గ్లోబల్ హబ్‌గా మారుబోతుందని సుందర్ పిచాయ్ సమ్మిట్‌లో ప్రస్తావించారని, అది మనకు గర్వకారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ నీచరాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయన్నారు. ఏఐతో జరగనున్న కొత్త ఆవిష్కరణలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. ప్రజలకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న ఆ పార్టీ చర్యలను తిప్పికొడతామని నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభి, ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్, జనసేన నాయకులు శివ ప్రసాద్, బీజేపీ నాయకులు దామోదర్ యాదయ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పల్లా శ్రీనివాసరావు, మాధవ్ పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.