మోదకొండమ్మ ఉత్సవాలపై అయోమయం!
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:19 PM
ఏడాది మే నెల 10, 11, 12 తేదీల్లో జరగాల్సిన స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలపై ప్రస్తుతం అయోమయం నెలకొంది. ఉత్సవ కమిటీ ఉత్సాహంగా లేకపోవడమే ఇందుకు కారణం.
మే 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని కమిటీ నిర్ణయం
ఉత్సాహంగా లేని ఉత్సవ కమిటీ
నేటికీ మొదలు కాని కనీస ఏర్పాట్లు
పాడేరు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మే నెల 10, 11, 12 తేదీల్లో జరగాల్సిన స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలపై ప్రస్తుతం అయోమయం నెలకొంది. ఉత్సవ కమిటీ ఉత్సాహంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఈ ఏడాది మే నెలలో ఉత్సవాలను నిర్వహించాలని గత ఫిబ్రవరి 21న ఆలయ కమిటీ తేదీలను నిర్ణయించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ప్రకటించారు. అయితే ఉత్సవాల తేదీలను ప్రకటించినప్పడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆ కార్యక్రమానికి హాజరుకాకపోవడం గమనార్హం. అయితే ఫిబ్రవరి 21న ఉత్సవాల తేదీలను ప్రకటించినా ఉత్సవ కమిటీ నేటి వరకు ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా మిన్నకుండడంతో ఉత్సవాల నిర్వహణపై భక్తుల్లో అయోమయం నెలకొంది. ఈ ఏడాది ఉత్సవాలు జరుగుతాయా? లేదా తేదీలు మారుతాయా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే ఉండడం, ఇప్పటికీ కనీస ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్ధారణ, తదితర ఏర్పాట్లు ఏవీ మొదలు కాలేదు. గతేడాది ఏప్రిల్ మొదటి వారానికే ఆలయానికి రంగులు వేయడం, చందాల వసూళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్థారణ వంటి పనులు చకచకా జరిగాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడంతో సందిగ్ధత ఏర్పడింది.