Share News

ఇంధనంపై గందరగోళం

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:03 AM

జిల్లాలో ఎక్కడా పెట్రోలు, డీజిల్‌ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా వుంది. దాదాపు సగం బంకుల్లో పెట్రోల్‌ అందుబాటులో వుండగా, చాలా తక్కువ బంకుల్లో డీజిల్‌ విక్రయిస్తున్నారు. దీంతో ఆయా బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. కాగా పెట్రోల్‌, డీజిల్‌ స్టాకు లేదంటూ పలు మండలాల్లో బంకులను మూసేశారు.

ఇంధనంపై గందరగోళం
చోడవరంలో వాహనదారులతో రద్దీగా వున్న ఒక పెట్రోల్‌ బంకు

పెట్రోలు, డీజిల్‌ కొరత లేదంటున్న అధికారులు

మరోవైపు అత్యధిక బంకుల్లో డీజిల్‌ అమ్మకాలు బంద్‌

పెట్రోల్‌కు కొరత లేకపోయినా.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో క్యూ కడుతున్న వాహనదారులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

జిల్లాలో ఎక్కడా పెట్రోలు, డీజిల్‌ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా వుంది. దాదాపు సగం బంకుల్లో పెట్రోల్‌ అందుబాటులో వుండగా, చాలా తక్కువ బంకుల్లో డీజిల్‌ విక్రయిస్తున్నారు. దీంతో ఆయా బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. కాగా పెట్రోల్‌, డీజిల్‌ స్టాకు లేదంటూ పలు మండలాల్లో బంకులను మూసేశారు. కానీ అధికారులు మాత్రం అన్ని బంకుల్లో తగినంత ఆయిల్‌ నిల్వలు ఉన్నాయని, సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదని చెబుతున్నారు. బంకుల నిర్వాహకులకు గతంలో మాదిరిగా ఆయిల్‌ కంపెనీలు క్రెడిట్‌ ఇవ్వడం లేదని, ముందుగా డబ్బులు చెల్లిస్తేనే పెట్రోలు, డీజిల్‌ పంపుతున్నాయని అంటున్నారు. దీంతో పలు బంకుల యజమానులు డబ్బులు చెల్లించకపోవడంతో కంపెనీల నుంచి ఆయిల్‌ రావడంలేదని, ఈ కారణంగానే ఆయా బంకులను మూసివేశారని సమాచారం. అంతేతప్ప ఇంధన కంపెనీలు పెట్రోలు, డీజిల్‌ సరఫరాపై కోత విధించలేదని చెబుతున్నారు. కొన్ని బంకులు మూతపడడం, సామాజిక మాధ్యమాల్లో పెట్రోలు, డీజిల్‌ కొరత ఏర్పడిందని వార్తలు రావడంతో వాహనదారులు బంకులకు క్యూ కడుతున్నారు. అంతేకాక ప్రతి ఒక్కరూ ట్యాంకు ఫుల్‌ చేయించుకుంటుండడంతో ఎక్కువ సమయం పడుతున్నదని, ఈ కారణంగా బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయని పౌరసరఫరాల అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎవరూ ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో కొన్నిచోట్ల బంకుల నిర్వాహకులు వాహనాలకు పరిమితంగానే పెట్రోలు, డీజిల్‌ కొడుతున్నారు. తహశీల్దార్లు, పౌరసరఫరాల అధికారులు తమ పరిధిలోని పెట్రోల్‌ బంకులను తనిఖీ చేసి, స్టాకు వివరాలను పరిశీలించారు. పెట్రోలు, డీజిల్‌ కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బంకుల నిర్వాహకులను ఆదేశించారు.

చోడవరం మండలంలో మొత్తం ఏడు బంకులు వుండగా వీటిలో చోడవరం పాత బస్టాండ్‌ వద్ద ఉన్న బంకులో పెట్రోలు, కొత్తూరు శివారులో ఉన్న బంకులో పెట్రోలు, డీజిల్‌ వున్నాయి. దీంతో ఈ రెండు బంకుల వద్ద వాహనదారులు బారులుతీరారు. చోడవరంలోని మరో రెండు బంకులతోపాటు నరసాపురం, వెంకన్నపాలెం, గవరవరం గ్రామాల్లో బంకుల్లో స్టాకు లేదు.

రావికమతంలో మూడు బంకులు వుండగా.. అన్నీ శనివారం నుంచే మూతపడ్డాయి. దీంతో వాహనదారులు అటు వడ్డాది, ఇటు కొత్తకోట వెళ్లి డీజిల్‌ కొట్టిస్తున్నారు. నాతవరంలోని బంకులో రెండు రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొలుగొండలోని బంకులో రెండు రోజులుగా డీజిల్‌, పెట్రోల్‌ లేకపోవడంతో వాహనదారులు నర్సీపట్నం వెళ్లాల్సి వస్తున్నది. మాడుగుల మండలంలో ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో రెండు, సాగరం, ముకుందపురం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు బంకులు ఉన్నాయి. ఘాట్‌రోడ్డు జంక్షన్‌లోని హెచ్‌పీసీఎల్‌ బంకులో మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ స్టాక్‌ వుంది. మిగిలిన మూడు బంకులను మూసివేశారు. ఎస్‌.రాయవరం మండలంలో ఏడు బంకులు ఉన్నాయి. అన్ని బంకుల్లో సోమవారం మధ్యాహ్నం తరువాత డీజిల్‌ అయిపోయింది. పెట్రోల్‌ కొరత లేదు. సోమవారం సాయంత్రానికి దార్లపూడి బంకుకు 8,000 లీటర్ల డీజిల్‌ వచ్చింది. మిగిలిన బంకులకు కూడా సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయానికి డీజిల్‌ వస్తుందని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.

ఎలమంచిలి పట్టణం, మండలం మొత్తం ఎనిమిది బంకులు వున్నాయి. అన్ని బంకుల్లో పూర్తిస్థాయిలో పెట్రోలు, డీజిల్‌ నిల్వలు వున్నాయి. అయితే ఆటోలకు మూడు, నాలుగు లీటర్లకు మించి డీజిల్‌ కొట్టడంలేదు. మిగిలిన అన్ని రకాల వాహనాలకు కావాల్సినంత పెట్రోలు, డీజిల్‌ విక్రయిస్తున్నారు.

దేవరాపల్లిలోని పెట్రోల్‌ బంకులో పెట్రోలు, డీజిల్‌ పూర్తిస్థాయిలో వున్నాయి. అయితే సమీపంలోని చోడవరం మండలం గవరవరంలో బంకు మూతపపడంతో పలు గ్రామాలకు చెందిన వాహనదారులు దేవరాపల్లి బంకుకు వస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ ఎంత కావాలన్నా బంకు నిర్వాహకులు కాదనకుండా విక్రయిస్తున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 01:03 AM