రాళ్లు తేలిన రోడ్లతో అవస్థలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:31 PM
మండలంలోని పలు రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రాళ్లు తేలి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి.
ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు
సబ్బవరం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రాళ్లు తేలి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. మండలంలోని పినగాడి- కోటపాడు రోడ్డు నుంచి అయ్యన్నపాలెం శివారు బుదిరెడ్లపాలెం, ఎల్లుప్పి, ఎల్లుప్పి శివారు మర్రిపాలెం వెళ్లే రహదారి, పినగాడి-కోటపాడు రోడ్డు నుంచి అయ్యన్నపాలెం శివారు కిల్లవానిపాలెం వెళ్లే రహదారులు దారుణంగా ఉన్నాయి. దీంతో నిత్యం ఈ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మర్రిపాలెం, ఎల్లుప్పి వెళ్లే రోడ్డు పలు చోట్ల గోతులు ఏర్పడి రాళ్లు తేలి ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిల్లివానిపాలెం వెళ్లే రహదారికి 2019లో పీఎంజీఎస్‌వై కింద కోటి రూపాయలు మంజూరు కాగా, అప్పటి టీడీపీ ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించింది. దాదాపు చివరి దశకు చేరుకునేలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ రోడ్డు పనులు నిలిచి పోయాయి. అప్పటి నుంచి దాదాపు ఏడేళ్లుగా రాళ్లు తేలిన రోడ్డుపైనే కిల్లవానిపాలెం ప్రజలు రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిల్లవానిపాలెం రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండడంతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లు బాగు చేయాలని కోరుతున్నారు. దీనిపై పంచాయతీరాజ్ ఏఈ హరిణిని వివరణ కోరగా కోటపాడు-కిల్లివానిపాలెం రోడ్డుకు రూ.75 లక్షలు, కోటపాడు- బుదిరెడ్లపాలెం, మర్రిపాలెం, ఎల్లుప్పి రోడ్లకు కోటి రూపా యలు మంజూరైనట్టు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.