అరకొర సౌకర్యాలతో అవస్థలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:19 PM
గిరిపుత్రులకు నాణ్యమైన విద్యనందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తేవడంలో గురుకుల సొసైటీ, జిల్లా అధికార యంత్రాంగం విఫలమైంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఏకలవ్య గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. దీంతో అరకొర సౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు.
పీఎం ప్రారంభించి రెండేళ్లు అయినా విద్యార్థులకు తప్పని తిప్పలు
అధికారుల పర్యవేక్షణ లోపం.. అరకులోయ ఏకలవ్య గురుకులానికి శాపం
రెండోదశ పనులు అయిపోతున్నా.. మొదటిదశ నిర్మాణాలు పూర్తికాని వైనం
అరకులోయ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పాడేరు మన్యంలోని 11 మండలాల్లో 11 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి రెండు విడతల్లో ఒక్కొక్క పాఠశాలకు రూ.40 కోట్లు మంజూరు చేసింది. అరకులోయ మండలం బొండాం పంచాయతీ మజ్జివలస గ్రామ సమీపంలో ఏకలవ్య గురుకుల పాఠశాలకు 15 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో తొలి విడత మంజూరైన రూ.20 కోట్లతో 2021-22 సంవత్సరంలో భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. పనులు చకచకా సాగుతున్న సమయంలో బిల్లుల మంజూరులో జాప్యంతో ఎనిమిది నెలలపాటు జాప్యం ఏర్పడింది. అనంతరం బిల్స్ కావడంతో దాదాపు పనులు పూర్తిచేసి ఇంటర్నల్ రోడ్స్, ప్లంబింగ్ పనులు, కిచెన్‌కు సంబంధించిన పనులు మిగిలి ఉండగానే ఏడాదిన్నర క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాటశాలలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దీంతో అరకొర సౌకర్యాలతో అరకులోయలో ఐటీడీఏ యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో(వైటీసీ) ఉన్న అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ ‘ఏకలవ్య’ విద్యార్థులు ఎంతో ఆనందపడ్డారు. అన్ని సౌకర్యాలతో కూడిన పాటశాల, వసతి గృహానికి వెళ్లిపోతామని ఆశపడ్డారు. కానీ ఆశలు నేటి వరకు నెరవేరలేదు. ఒక్క డుంబ్రిగుడ ఏకలవ్య గురుకుల పాఠశాలకు సొంత భవనాలు సమకూరడంతో అక్కడి విద్యార్థులు వెళ్లిపోయారు. అయితే వైటీసీలో ఇంకా అరకులోయ, అనంతగిరి విద్యార్థులు వైటీసీలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానమంత్రి ప్రారంభించిన సమయానికి ప్రధాన భవనం, బాల,బాలికలకు సంబంధించిన వసతిగృహం, వార్డెన్, మెట్రిన్‌ల నివాసగృహాలు, డైనింగ్ హాల్, కిచెన్‌లకు సంబంధించిన భవనాలు, ప్రహరీ, నీటిసౌకర్యం పూర్తయ్యాయి. అయినా నేటికీ ఆ భవనాలను అందుబాటులోకి తీసుకురాలేదు. కారణమేమిటంటే.. తొలి దశలో చేపట్టిన పనులకు అదనంగా రూ.రెండు కోట్లు ఖర్చు అయ్యిందని, అదనపు వ్యయం బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ ఆ భవనాలను అధికారులకు అప్పగించలేదు. ఇటీవల పెండింగ్ బిల్లులు చెల్లించడంతో మొదటిదశకు సంబంధించిన ప్లంబింగ్, కిచెన్‌లో అధునాతన మిషనరీని ఏర్పాటు చేసే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు అప్పగిస్తామంటున్నా పనులు పూర్తిచేసే పరిస్థితి కనిపించడంలేదు. ప్లంబింగ్, కిచెన్ పనులు పూర్తి చేసినా ఇంటర్నల్ రోడ్స్ పూర్తిచేసే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే విద్యాసంవత్సరానికి అయినా అరకులోయ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల భవనాలు అందుబాటులోకి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ఈ భవన నిర్మాణాల తీరును అటు గురుకుల సొసైటీ అధికారులుగానీ, జిల్లా యంత్రాంగం గాని పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ చేపడితే త్వరితగతిన పూర్తవుతాయని తల్లిదండ్రులు అంటున్నారు. ఇంటర్నల్ రోడ్లు రెండో విడత మంజూరైన భవన నిర్మాణాలతోపాటు చేపడతారని కాంట్రాక్టర్‌కు సంబంధించిన సైట్ ఇన్‌చార్జీలు చెబుతున్నారు.
మరో రూ.20 కోట్లతో రెండో విడత పనులు
గత ఏడాది నుంచే రెండో విడత భవన నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బాల,బాలికల వసతిగృహల భవనాలు, 20కి పైగా ఉపాధ్యాయులు,సిబ్బంది నివాసగృహాల భవనాలు, ప్రిన్సిపాల్ నివాసగృహం భవనాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ పనులను నిర్ణీత గ డువులోగా పూర్తిచేసే విధంగా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.