భవిష్యత్తు నీటి అవసరాలకు సమగ్ర ప్రణాళిక
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:17 AM
నగర భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అన్నారు.
జీవీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్
పెరుగుతున్న జనాభా, పరిశ్రమల ఏర్పాటును దృష్టిలో పెట్టుకోవాలి
వాటర్ సెక్యూరిటీ ప్లాన్ తయారీకోసం ఈనెల పదో తేదీన సమావేశం నిర్వహిస్తున్నామన్న కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
నగర భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు, ఎస్‌ఈ రవికుమార్, ఇరిగేషన్, విస్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా జీవీఎంసీ కమిషనర్ ప్రస్తుతం నగరంలో తాగునీటి నిర్వహణ తీరుతెన్నులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2024 నాటి అంచనా ప్రకారం నగర జనాభా 24 లక్షలని, వారందరికీ తాగునీటి అవసరాల కోసం 453 ఎంఎల్‌డీ నీరు ప్రతిరోజూ అవసరం అవుతుందన్నారు. అయితే జీవీఎంసీ 390 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతోందన్నారు. 2040 నాటికి డిమాండ్ 726 ఎంఎల్‌డీకి, 2055 నాటికి 836 ఎంఎల్‌డీకి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవసరాలకు తగ్గట్టుగా బృహత్‌కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ తయారీకోసం ఈనెల పదో తేదీన సింగపూర్ వాటర్ సెంటర్, పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు (పీయూబీ), ఆస్ట్రేలియాకు చెందిన ఐఎస్‌ఎఫ్‌తో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ మాట్లాడుతూ నగరంలో జనాభా పెరుగుదలతోపాటు పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ జరుగుతోందన్నారు. హెచ్‌పీసీఎల్, ఏపీఐఐసీ ఇండస్ర్టియల్‌పార్కులు, డేటా సెంటర్లు వంటి వాటికి భవిష్యత్తులో గణనీయమైన నీరు అవసరం పడుతుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నీటి వనరులను పెంచుకోవడం, ప్రత్యామ్నాయ వనరులను గుర్తించడం, రీసైక్లింగ్, కొత్తప్రాజెక్టులపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వీటన్నింటి కోసం ముందుగానే ఒక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.