నీటి భద్రతకు సమగ్ర ప్రణాళిక
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:38 AM
నీటి భద్రతను సాధించడంలో విశాఖ నగరం దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురే్‌షకుమార్ ఆకాంక్షించారు.
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వనరులు సిద్ధం చేసుకోవాలి
విశాఖ దేశానికి ఆదర్శంగా నిలవాలి
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురే్‌షకుమార్
నిపుణుల సలహాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో మెరుగైన ఫలితాలు: వీఈఆర్ సీఈవో యువరాజ్
విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):
నీటి భద్రతను సాధించడంలో విశాఖ నగరం దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురే్‌షకుమార్ ఆకాంక్షించారు. పెరుగుతున్న జనాభా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నీటి వనరులను సిద్ధం చేసుకోవాలన్నారు. ‘విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలో నీటి రంగంలో మూలధన పెట్టుబడి ప్రణాళిక (కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ ఫర్ ది వాటర్ సెక్టార్)’ అంశంపై నగరంలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. నీటి రంగంలో సమగ్ర మూలధన పెట్టుబడి ప్రణాళికను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. మునిసిపల్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, పనితీరు ఆధారిత ఒప్పందాల ద్వారా ఆర్థిక వనరులను సృష్టించుకోవడంపై దృష్టిసారించాలని జీవీఎంసీ, పరిశ్రమల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు సూచించారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగపూర్ వాటర్ సెంటర్, పీయూబీ కన్సల్టెంట్ సహకారంతో జీవీఎంసీ సంస్థాగతంగా సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీటి వనరు అనేది కేవలం పౌరసేవకు సంబంధించిన విషయమే కాదని, విశాఖ ఎకనామిక్ రీజియన్ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది అన్నారు. ఐటీ పార్కులు, పరిశ్రమలు, భవన నిర్మాణాలు, పర్యాటక రంగం అభివృద్ధి అన్నీ నీటి సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయని గుర్తుచేసుకోవాలన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి, విశాఖ ఎకనామిక్ రీజియన్ సీఈఓ డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ ‘రీజియన్’ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి భద్రతకు సమగ్ర ప్రణాళిక కీలకమన్నారు. అంతర్జాతీయ నిపుణుల సలహాలు, విదేశాల్లో నీటి భద్రతకు పాటిస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొత్త వనరుల గుర్తింపు వంటి వాటితో నీటి సరఫరాను మెరుగుపరచడంలో ఫలితాలు సాధించవచ్చునన్నారు. సీడీఎంఏ డాక్టర్ పి.సంపత్‌కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక నీటివనరుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన్యం ఇస్తోందన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఇప్పటి నుంచే ప్రణాళికలను అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే నీటి భద్రతకు ప్రణాళికలు తయారుచేయడం సాధ్యమవుతుందన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మాట్లాడుతూ దీర్ఘకాలిక నీటి అవసరాలను సాధించేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉందన్నారు. గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్టు, ఫార్మాసిటీ, ఐటీసెజ్‌లు, 7.5 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కాబోతున్నందున నీటి వనరులపై వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక అత్యవసరంగా మారిందన్నారు. ప్రస్తుతం నగరంలో 400 మిలియన్ లీటర్లు ప్రతీరోజు అవసరమవుతుండగా, 2040 నాటికి డిమాండ్ 726 ఎంఎల్‌డీలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ సదస్సులో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండుకర్, విశ్రాంత ఐఏఎస్ (నీతి ఆయోగ్) కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఐఎ్‌ఫసీ ప్రతినిధి విక్టోరియా హిల్డారిక్‌బై డెల్మన్, సింగపూర్ వాటర్ సెంటర్ ప్రతినిధి జీన్ మార్టిన్ బ్రాల్ట్, పీయూబీ కన్సల్టెంట్ జూచైయంగ్‌తోపాటు పలు దేశాలకు చెందిన యూనివర్సీటీల నిపుణులు పాల్గొన్నారు.