గ్రావెల్ రవాణాపై సమగ్ర దర్యాప్తు
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:54 AM
మండలంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు జరుగుతున్న ప్రదేశాల నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నట్టు వస్తున్న ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అనిత స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి
పోలీసు, గనుల శాఖల అధికారులకు మంత్రి అనిత ఆదేశం
నక్కపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు జరుగుతున్న ప్రదేశాల నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నట్టు వస్తున్న ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అనిత స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పాయకరావుపేట వైపు నుంచి నక్కపల్లి వైపు గ్రావెల్ రవాణా చేస్తున్న మూడు టిప్పర్ లారీలను సీఐ జె.మురళీ పట్టుకున్నారు.గ్రావెల్‌ను తరలించేందుకు ఏఎంఆర్ కంపెనీ జారీ చేసిన బిల్లులను డ్రైవర్లు చూపించారు. అనుమానం వచ్చిన పోలీసులు.. గ్రావెల్‌తో సహా వాహనాల బరువును వే బ్రిడ్జిపై తూకం వేయించారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం ఏఎంఆర్ కంపెనీ జారీ చేసినట్టు చెబుతున్న బిల్లులు, వే బ్రిడ్జి తూకం రిసీట్‌ను గనుల శాఖ అధికారులకు పంపారు. కాగా నక్కపల్లి మండలంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు జరుగుతున్న చోట నుంచి కొందరు కూటమి నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున గ్రావెల్, మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయాలు మీడియాలో రావడంతో హోం మంత్రి అనిత స్పందించారు. గ్రావెల్ రవాణాకు అనుమతులున్నాయా? పోలీసులు పట్టుకున్న లారీలు ఎవరివి? గ్రావెల్ తరలింపు వెనుక ఎవరు వున్నారు? తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి, రెండు రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని పోలీసు, గనుల శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. ఇదిలావుండగా టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, గ్రావెల్ రవాణాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.