సమన్వయంతోనే సంపూర్ణ విజయం
ABN , Publish Date - Aug 23 , 2026 | 01:08 AM
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కూటమి గెలుచుకోవాలి
పార్టీ క్యాడర్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిశానిర్దేశం
కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని భరోసా
కె.కోటపాడు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన శనివారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ కోడూరు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీకి నాడు, నేడు కార్యకర్తలే అండగా నిలుస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. మండల టీడీపీ నాయకులు, క్లస్టర్, బూత్ ఇన్‌చార్జులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు వారికి తగిన గౌరవం దక్కేలా చూస్తానన్నారు. పార్టీ కోసం అహర్నిశలూ పనిచేసే సాధారణ కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో క్లస్టర్ ఇన్‌చార్జిగా పనిచేసిన సాధారణ మహిళకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబునాయుడు సూచించారు. గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త పార్టీకి అండగా నిలిచి ప్రజలతో మమేకం కావాలన్నారు.
బాబుకు బ్రహ్మరథం
అనకాపల్లి/కె.కోటపాడు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ కోడూరులో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జనం బ్రహ్మరథం పట్టారు. హెలీప్యాడ్ వద్ద ఆయనకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు స్వాగతం పలికారు. అక్కడ నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభా వేదిక వరకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులుతీరి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. పలుచోట్ల చంద్రబాబునాయుడు కారు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.