హైవేలో పెండింగ్ పనులు పూర్తి చేయండి
ABN , Publish Date - Aug 21 , 2026 | 10:34 PM
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516ఈ కి సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు.
అధికారులకు జేసీ శ్రీపూజ ఆదేశం
అటవీ అనుమతులకు సమన్వయంతో పనిచేయాలి
పనుల నాణ్యతలో రాజీ పడొద్దు..
పాడేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516ఈ కి సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు. తన చాంబర్‌లో గురువారం రాత్రి హైవే, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ పనులు, బైపాస్ రోడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై జేసీ ఆరా తీశారు. అటవీ సమస్యలుంటే ఆర్‌డీవో, తహశీల్దార్లు, అటవీ శాఖాధికారులు సమన్వయంతో అటవీ అనుమతులు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. హైవే నిర్మాణంలో పనులన్నీ నాణ్యతగా చేపట్టాలని, ఈక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడవద్దన్నారు. ప్రజా రవాణాకు అత్యంత కీలకమైన ఈ రహదారి పనులను నిరంతరం పర్యవేక్షించాలని, ఈక్రమంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డీవో ఎ.భుజంగరావు, కలెక్టరేట్ డీటీ పోలరాజు, హైవే డీటీ వై.రామ్మూర్తి, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.