Share News

చింతపల్లి ట్రెజరీ కుంభకోణంలో మరో ఎనిమిది మందిపై ఫిర్యాదు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:10 AM

చింతపల్లి ట్రెజరీ కుంభకోణంలో మరో ఎనిమిది మంది ఉద్యోగులను నిందితులుగా చేర్చాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కృష్ణమూర్తి నాయక్‌ తెలిపారు.

చింతపల్లి ట్రెజరీ కుంభకోణంలో మరో ఎనిమిది మందిపై ఫిర్యాదు
విలేకరులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌

డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఉత్తర్వులు

డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌

చింతపల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి ట్రెజరీ కుంభకోణంలో మరో ఎనిమిది మంది ఉద్యోగులను నిందితులుగా చేర్చాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కృష్ణమూర్తి నాయక్‌ తెలిపారు. 2011 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన నిధులను ట్రెజరీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కుమ్మక్కై లేని ఉద్యోగులను ఉన్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి రూ.6,72,27,042 నగదును దోచుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కుంభకోణం అప్పటిలో సంచలనం నృష్టించింది. వైద్య ఆరోగ్యశాఖ, ఉప ఖజానా అధికారుల ఫిర్యాదుతో చింతపల్లి పోలీసులు ఇప్పటికి 62 మంది వైద్య ఆరోగ్యశాఖ, ట్రెజరీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానం విచారణలో ఉన్నది. అయితే ఈ కేసులో తాజాగా మరో ఎనిమిది మంది ఉద్యోగుల పాత్ర వున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఈ కేసులో పాత్రధారులైన ముగ్గురు వైద్యాధికారులు, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు ఎంపీహెచ్‌ఈవోలపై ఫిర్యాదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం చింతపల్లి వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్థానిక ఏఎస్పీకి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ 2011-15 ప్రాంతంలో చింతపల్లిలో వైద్యాధికారిగా పనిచేసిన టి.అరుణదేవి, సప్పర్ల, ధారకొండ పీహెచ్‌సీ వైద్యాధికారి డి.మహేశ్వరరావు, పెదవలస పీహెచ్‌సీ వైద్యాధికారి టి.ప్రవీణ్‌, చింతపల్లి, కోరుకొండ సీనియర్‌ అసిస్టెంట్లు బి.ధర్మేంద్ర, షేక్‌ హుస్సేన్‌, హుకుంపేట ఎంపీహెచ్‌డబ్ల్యూవోలు జేవీ కొండలరావు, బొడ్డేటి జగ్గారావు, జి.సంజీవ్‌లపై ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు విచారణ చేపట్టి ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరినట్టు ఆయన చెప్పారు.

Updated Date - Jan 20 , 2026 | 12:10 AM