డీఆర్వో పోస్టుకు పోటీ
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:06 AM
విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టుకు సీనియర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారులు తీవ్రంగా పోటీపడుతున్నారు.
నాలుగునెలలుగా ఇన్‌చార్జిలతో పాలన
విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):
విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టుకు సీనియర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారులు తీవ్రంగా పోటీపడుతున్నారు. వీరిలో మహిళా అధికారి ఒకరు ఉన్నారు. రాజకీయంగా, బ్యూరోక్రాట్‌ల నుంచి ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న అధికారి సొంత జిల్లా శ్రీకాకుళంలో అధికార పార్టీ ఎమ్మెల్యేతో సీఎంఎకు చెప్పించారనే ప్రచారం సాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో వైద్యులతో నిత్యం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో డీఆర్వోగా వెళితే మంచిదని ఆయన భావించినట్టు చెబుతున్నారు. ఏపీఐఐసీలో పనిచేస్తున్న మరో అధికారి పైరవీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో డీఆర్వో పోస్టు కీలకమైనదే. ఈ పోస్టులో పనిచేసిన భవానిశంకర్ వివాదంలో చిక్కుకుని అర్ధంతరంగా బదిలీ కావాల్సి వచ్చింది. గత ఏడాది దీపావళి రోజున ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం ఇంతవరకు ఎవరినీ నియమించలేదు. అప్పటి నుంచి కొంతకాలం జాయింట్ కలెక్టర్ కు డీఆర్వో బాధ్యతలు అప్పగించారు. జేసీకి పనిభారం ఉండడంతో హౌసింగ్ పీడీ సీహెచ్ సత్తిబాబుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూలో సీనియర్ అయిన సత్తిబాబును డీఆర్వోగా నియమించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరింది. ప్రొటోకాల్ విధులు, పలు పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతలు డీఆర్వో కు అప్పగిస్తుంటారు. అంతటి కీలకమైన విధుల్లో పూర్తిస్థాయి అధికారి ఉండాలని కోరారు. అందుకు తగినట్టుగానే అమరావతిలో ఫైలు కదలింది. అయితే విజయనగరం జిల్లాలో పలు పరిశ్రమలకు భారీస్థాయిలో భూసేకరణకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా సీనియర్ అధికారి, ముఖ్యంగా భూ సేకరణలో అనుభవం ఉన్న సత్తిబాబు పేరును మంత్రి నారా లోకేశ్ వద్ద విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గత వారం విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో లోకేశ్ నిర్వహించిన విందు సమావేశంలో ఈ చర్చ జరిగింది. దీంతో సత్తిబాబును విజయనగరండీ ఆర్వోగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఇద్దరుముగ్గురు అధికారులు విశాఖ డీఆర్వో పోస్టుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. మూడు రోజుల క్రితమే ఆర్డర్స్ వస్తాయని భావించారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ నియమితులవడంతో రాష్ట్రవ్యాప్తంగా డీఆర్వోలు, ఇతర పోస్టుల నియామకాల ఫైలు ఆయన వద్ద చర్చించిన తరువాత ఉత్తర్వులు వెలువడతాయని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి.