Share News

కమ్యూనిటీ ఫ్రిడ్జ్‌లు ఖాళీ!

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:39 AM

ఆకలి రహిత విశాఖ నగరాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో నగర పోలీస్‌కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి అందుబాటులోకి తెచ్చిన ‘కమ్యూనిటీ ఫుడ్‌ ఫ్రిడ్జ్‌ కంటెయినర్ల’కు దాతల కొరత ఏర్పడింది.

కమ్యూనిటీ ఫ్రిడ్జ్‌లు ఖాళీ!

పిలుపునిచ్చినా స్పందించని దాతలు

నగరంలో ఐదు చోట్ల ఏర్పాటుచేసిన సీపీ శంఖబ్రతబాగ్చి

కంట్రోల్‌రూం సీఐ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్‌ఐలకు ఇన్‌చార్జి బాధ్యతలు

ఆహారం సరఫరా చేసే దాతల కోసం వేట

గాజువాక మినహా మిగిలిన చోట్ల ముందుకురాని వైనం

ఎస్‌ఐలే ఆహారం కొని తెచ్చి పెట్టాల్సిన పరిస్థితి

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

ఆకలి రహిత విశాఖ నగరాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో నగర పోలీస్‌కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి అందుబాటులోకి తెచ్చిన ‘కమ్యూనిటీ ఫుడ్‌ ఫ్రిడ్జ్‌ కంటెయినర్ల’కు దాతల కొరత ఏర్పడింది. ఈనెల 15న అట్టాహాసంగా ప్రారంభించిన ఫుడ్‌ఫ్రిడ్జ్‌లు తమకు అక్షయపాత్రగా మారతాయని అన్నార్తులు పెట్టుకున్న ఆశలు మూడ్నాళ్లకే ఆవిరయ్యాయి. ఆహారం సరఫరా చేసేందుకు దాతలు ముందుకు రాకపోవడంతో పోలీసులే ఏదో బాధపడి సమయం దాటినా ఎంతోకొంత ఆహారం ఫ్రిడ్జ్‌ల్లో పెడుతున్నారు. కొన్నిసార్లు ఆహారం లభించక ఫ్రిడ్జ్‌లు ఖాళీగా ఉండిపోవడంతో ఆశగా వచ్చినవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

నగరంలో ఆహారం లభించక ఆకలితో అలమటిస్తూ రోడ్లపై తిరిగేవారికి సమయానికి నాణ్యమైన ఆహారాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచేందుకు సీపీ శంఖబ్రతబాగ్చి ‘కమ్యూనిటీ ఫుడ్‌ కంటెయినర్‌’ పేరుతో ఫుడ్‌బ్యాంక్‌ల కింద ఫ్రిడ్జ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ముందుగా కొందరు దాతల సహకారంతో మద్దిలపాలెం, ద్వారకానగర్‌, జగదాంబజంక్షన్‌, గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల్లో ఈనెల 15న వీటిని ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం, రాత్రి భోజన సమయానికి దాతల నుంచి సేకరించిన నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు వీలుగా కంట్రోల్‌రూమ్‌ సీఐ ఆధ్వర్యంలో ఒక్కో ఫుడ్‌కంటెయినర్‌కు ఒక్కో ఎస్‌ఐని ఇన్‌చార్జిగా నియమించారు. ఎస్‌ఐలతోపాటు సీఐ కూడా తమ పరిధిలోని హోటళ్లు, కేటరింగ్‌ నిర్వాహకులతోపాటు వ్యాపారులను కలిసి ఫుడ్‌కంటెయినర్లకు కనీసం పది ప్యాకెట్‌లు చొప్పున ఒక్కోరోజు ఒకరు ముందుకు వచ్చేలా చూడాలి. దీనివల్ల ఆహారం కోసం అలమటించే అభాగ్యులు, నిరుపేదకుటుంబాలకు చెందినవారు భోజనం సమయానికి సమీపంలోని ఫుడ్‌కంటెయినర్‌ వద్దకు వెళ్లి అందుబాటులో ఉంచిన ఆహారాన్ని తీసుకుని ఆకలి తీర్చుకునేందుకు వీలుంటుంది.

వారం రోజుల ముచ్చటే..

ప్రారంభించిన వారం రోజుల వరకు దాతల సహకారం అందినప్పటికీ బాగానే అందినప్పటికీ, ఆ తర్వాత ముఖంచాటేస్తున్నారని పోలీసులు వాపోతున్నారు. ప్రతిరోజూ దాతల కోసం వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు, క్యాటరింగ్‌ నిర్వాహకుల వద్దకు వెళ్లి ఆహారం అందించేలా ప్రయాస పడుతున్నారు. ద్వారకానగర్‌లోని ఫుడ్‌కంటెయినర్‌కు దాతలు ముందుకురాక గత మూడు రోజులుగా ఆహారం లేదు. దీంతో అభాగ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం గాజువాకలో మాత్రం రోజూ రాత్రి సమయంలో ఆహారం సరఫరా చేసేందుకు వైద్య దంపతుల జంట ముందుకువచ్చారు. మిగిలిన నాలుగుచోట్ల దాతల సహకారం కొరవడి సీపీ ఆశయం నీరుగారిపోతోందని పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మద్దిలపాలెం కూడలిలో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఒకరు వచ్చి ఫుడ్‌కంటెయినర్‌లో ఒక ప్యాకెట్‌తో ఆహారం పెట్టగా, వెంటనే ఓ వృద్ధురాలు తీసుకుపోవడంతో ఫ్రిడ్జ్‌ ఖాళీ అయిపోయింది. ఆహారం సమకూర్చేందుకు దాతలు లభించకుంటే సమయం దాటినా ఫుడ్‌కంటెయినర్‌లో ఆహారం ఉంచాలనే తపనతో ఎస్‌ఐలే సొంత డబ్బు లేదా సిబ్బంది సహకారంతో హోటళ్ల నుంచి కొనుగోలుచేసి ఫుడ్‌కంటెయినర్‌లో ఉంచుతున్నారు. అయితే అప్పటికే సమయం దాటిపోవడంతో ఒకరిద్దరు మినాహా ఎవరూ రాకపోవడంతో ఆహారం వృథాగా పోతోంది. ఇప్పటికైనా నగరంలోని వ్యాపార ప్రముఖులు, ఉన్నతస్థానాల్లోని వారు, విదేశాల్లో స్థిరపడిన పిల్లలున్న తల్లిదండ్రులు సామాజిక సేవా బాధ్యతతో ముందుకువచ్చి ఫుడ్‌కంటెయినర్‌లకు ఆహారం సమకూర్చేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:39 AM