Share News

కైలాసగిరి అభివృద్ధికి కమిటీ

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:36 AM

కైలాసగిరిపై రైలు బ్రేకులు ఫెయిలై వెనక్కి వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

కైలాసగిరి అభివృద్ధికి కమిటీ

రకరకాల ప్రతిపాదనలు

అన్నింటికంటే ముందు ఇన్‌చార్జి నియామకం అవసరం

ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టిపెట్టాలి

‘మరో మార్గం’ నిర్మాణం ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకురావాలి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కైలాసగిరిపై రైలు బ్రేకులు ఫెయిలై వెనక్కి వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అభివృద్ధి పేరుతో కమిటీని వేశారు. వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ అధ్యక్షతన అదే సంస్థ నుంచి నలుగురు అధికారులను, జీవీఎంసీ, పోలీస్‌, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక శాఖల నుంచి ఒక్కో అధికారిని నియమిస్తూ మొత్తం 12 మందితో కమిటీ ప్రకటించారు. ఎంపీ శ్రీభరత్‌ అధ్యక్షతన సమావేశం కూడా నిర్వహించారు. కైలాసగిరికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని, పార్కింగ్‌ సరిపోవడం లేదని, బస్సులు మధ్యలో ఆగిపోతున్నాయని పరిష్కారాలు సూచించాలని అందరినీ కోరారు. పాడైపోయిన ట్రైన్‌ను పక్కన పెట్టి భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ట్రాక్‌, కొత్త రైలు పెడితే బాగుంటుందని ఒకరు సూచించారు. ప్రమాదాలు జరిగితే వైద్యం అందించడానికి డాక్టర్‌తో కూడిన హెల్త్‌ సెంటర్‌, ప్రమాదాలలో సాయం అందించడానికి అగ్నిమాపక కేంద్రం, ప్రత్యామ్నాయ మార్గం, కిందన పార్కింగ్‌ వంటివి పెట్టాలని పలువురు సూచించారు. ఎలక్ర్టికల్‌ బస్సులు నడపాలని, బ్యాటరీ కార్లు వేయాలని కొందరు ప్రతిపాదించారు. అయితే అసలు సమస్య, దానికి పరిష్కారం చూడకుండా కోట్ల రూపాయలు అవసరమయ్యే పనులు ప్రతిపాదించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇవీ సమస్యలు

- కైలాసగిరికి ఏడాదిలో ఆరు నెలలే పర్యాటకులు ఎక్కువగా వస్తారు. మిగిలిన సీజన్‌లో ఖాళీగానే ఉంటుంది. రద్దీ సమయంలో ట్రాఫిక్‌ నిర్వహణ చేపడితే సరిపోతుంది. కైలాసగిరికి ప్రస్తుతం బాధ్యులు ఎవరూ లేరు. ఒక ఇన్‌చార్జిని నియమించి, అక్కడ ఏ రోజుకారోజు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నప్పుడు టోల్‌గేటు వద్ద వాహనాలు కొద్ది సేపు ఆపితే పరిస్థితి కొద్దిసేపటికి చక్కబడుతుంది. పార్కింగ్‌లో వాహనాలు సక్రమంగా పెట్టడం, ఏదైనా వాహనం ఆగిపోతే దానిని వెంటనే టోయింగ్‌ యంత్రంతో పక్కకు పెట్టే విధంగా చూడాలి. దీనికి సమన్వయంతో పనిచేసే వారికి బాధ్యతలు ఇస్తే సరిపోతుంది. ఇప్పటివరకు అలాంటి వ్యవస్థ లేదు.

- కొండపై 200 బైకులు, 50 కార్లు, 5 బస్సులు నిలుపుకొనే స్థలం మాత్రమే ఉంది. అంతకు మించి వాహనాలు పైకి పంపితే ఇబ్బందే. దీనికి అనుగుణంగా రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు కిందనే పార్కింగ్‌ అభివృద్ధి చేసి అక్కడే వాహనాలు ఆపేయాలి.

- కొండపైకి వాహనాలు వెళ్లి, రావడానికి మరో మార్గం అవసరమని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. దానిని ఆచరణలోకి తేవాలి.

- కొండపై ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి బృందాన్ని పెట్టుకోవడం, వాకీటాకీల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, అవసరానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, వీటన్నింటి పర్యవేక్షణకు ఒక అధికారిని బాధ్యుల్ని చేస్తే సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది. ఆ దిశగా అభివృద్ధి కమిటీ ఆలోచన చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 02 , 2026 | 12:36 AM