కమిషనర్ కన్నెర్ర
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:04 AM
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, ఉద్యోగులపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కన్నెర్ర చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపినందుకు పెందుర్తి వార్డు అడ్మిన్ సెక్రటరీపై సస్పెన్షన్
ముగ్గురు జోనల్ కమిషనర్లు సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు సైతం షోకాజ్ నోటీసులు
అవినీతి ఆరోపణలపై మధురవాడ జోన్‌లో పంచాయతీ వర్కర్‌పై వేటు
విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, ఉద్యోగులపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కన్నెర్ర చేశారు. రివిజన్ పిటిషన్‌కు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకుండా నెలల తరబడి దరఖాస్తును పెండింగ్‌లో ఉంచినట్టు గుర్తించడంతో పెందుర్తి-1 సచివాలయం వార్డు అడ్మిన్‌గా పనిచేస్తున్న కె.వరలక్ష్మిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
కమిషనర్ ఇటీవల జోనల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆస్తిపన్నుకు సంబంధించి ఆయా జోనల్ కమిషనర్‌లకు ప్రజలు పెట్టుకున్న జనరల్ రివిజన్ పిటిషన్లు, అసెస్‌మెంట్ యజమాని పేరు మార్పు, ఆస్తి బదలాయింపునకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా జాప్యం చేయడం, కిందిస్థాయి అధికారులు, సిబ్బందిపై పర్యవేక్షణలేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం వంటి అంశాలను గుర్తించారు. ఆయా అభియోగాలపై అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి, తూర్పు జోన్ కమిషనర్ శివప్రసాద్, అగనంపూడి జోనల్ కమిషనర్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అలాగే పెందుర్తి జోన్ రెవెన్యూ అధికారి అప్పలనాయుడు, మధురవాడ రెవెన్యూ అధికారి నాగేంద్ర, పెందుర్తి జోన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామునాయుడుకు సైతం షోకాజ్ నోటీసులు జారీచేశారు. ప్రజలకు అందించాల్సిన పౌర సేవల్లో జాప్యం చేస్తే సహించేది లేదని కమిషనర్ స్పష్టంచేశారు. ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించడంతోపాటు ఈఆర్‌పీలో నమోదయ్యే దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని, రెవెన్యూ వసూళ్లను, పన్ను బకాయిల వసూళ్లను నిరంతరం పర్యవేక్షించాల్సిందేనని స్పష్టంచేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న అధికారులు నిర్ణీత వ్యవధిలోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అలాగే మధురవాడ జోన్‌లో విలీన పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న జి.లక్ష్మణ్ తన విధులను పక్కనపెట్టి, రెవెన్యూకు సంబంధించిన అంశాల్లో తలదూర్చడం, దరఖాస్తుదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో అతడిని కూడా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.