Share News

పారిశుధ్యంపై కమిషనర్‌ అసంతృప్తి

ABN , Publish Date - May 08 , 2026 | 01:35 AM

నగరంలో పారిశుధ్య నిర్వహణకు భారీగా ఖర్చు చేస్తున్నా...ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు.

పారిశుధ్యంపై కమిషనర్‌ అసంతృప్తి

నిర్వహణ మరింత మెరుగుపడాలి

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

జోనల్‌ కమిషనర్లు నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందిగా ఆదేశం

విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):

నగరంలో పారిశుధ్య నిర్వహణకు భారీగా ఖర్చు చేస్తున్నా...ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతున్నా సరే బహిరంగ ప్రాంతాల్లో చెత్త కనిపిస్తోందన్నారు. ప్రధాన కార్యాలయంలో జోనల్‌ కమిషనర్లు, ఏఎంహెచ్‌ఓలు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని, దీనికోసం అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు అదనపు కార్మికుల సేవలను వినియోగించుకోవాలన్నారు. జోనల్‌ కమిషనర్లు నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి పారిశుధ్య లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై, దుకాణాల వద్ద ఎవరైనా వ్యర్థాలను వేస్తే వారికి జరిమానా విధించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ఇప్పటినుంచే చర్యలు ప్రారంభించాలని జోనల్‌ కమిషనర్లను ఆదేశించారు. విధులకు హాజరుకాని కార్మికులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ పి.నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ ఈఎన్‌వీ నరేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 01:35 AM