మార్కెట్ స్థలంలో వాణిజ్య సముదాయం
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:44 AM
స్థానిక ఇందిరా మార్కెట్ స్థలంలో భారీ వాణిజ్య సముదాయం నిర్మాణానికి మునిసిపాలిటీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి మునిసిపల్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న ఇందిరా మార్కెట్ స్థలం... స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో వినియోగంలోకి రావడానికి మార్గం సుమగం అయ్యింది.
ప్రైవేటు సంస్థకు డీపీఆర్ తయారీ బాధ్యత
స్థలాన్ని మునిసిపాలిటీకి బదయించాలని జడ్పీ సీఈవోకి లేఖ
వాణిజ్య సముదాయ ఆదాయంలో సగం మండల పరిషత్తుకు ఇవ్వాలని సభ్యుల పట్టు
35 శాతం ఇవ్వడానికి మునిసిపల్ అధికారుల ప్రతిపాదన
నర్సీపట్నం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఇందిరా మార్కెట్ స్థలంలో భారీ వాణిజ్య సముదాయం నిర్మాణానికి మునిసిపాలిటీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి మునిసిపల్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న ఇందిరా మార్కెట్ స్థలం... స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో వినియోగంలోకి రావడానికి మార్గం సుమగం అయ్యింది. అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా క్రెడిట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ ఇనిషియేటివ్ పథకం కింద రాష్ట్రంలో మూడు పురపాలక సంఘాలను ఎంపిక చేయగా వీటిలో నర్సీపట్నం ఒకటి కావడం విశేషం.
కాగా మండల పరిషత్ ఆధీనంలో ఉన్న ఇందిరా మార్కెట్ స్థలాన్ని మునిసిపాలిటీకి బదయించాలని కమిషనర్ సురేంద్ర, జిల్లా పరిషత్ సీఈవోతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. సీఈవో ఈ విషయాన్ని ఎంపీడీవోకి తెలియజేసి ఆయన నిర్ణయాన్ని కోరారు. దీంతో గత నెల 26న జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అజెండాలో దీనిని పెట్టారు. అయితే మండల పరిషత్‌లో వైసీపీకి మెజారిటీ సభ్యులు వుండడంతో ఇందిరా మార్కెట్ స్థలం మండల పరిషత్ ఆధీనంలోనే ఉంచాలని తీర్మానం చేశారు. ఒకవేళ మునిసిపాలిటీకి అప్పగించి, వాణిజ్య సముదాయం నిర్మిస్తే.. దీనిద్వారా వచ్చే ఆదాయంలో సగం మండల పరిషత్‌కు ఇవ్వాలని షరతు పెట్టారు.
ఇందిరా మార్కెట్ 2.41 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మార్కెట్ నిర్వహణను మునిసిపాలిటీ చూస్తున్నప్పటికీ స్థలం మాత్రం అధికారికంగా మండల పరిషత్ ఆధీనంలో ఉంది. ఇక్కడ 90కి పైగా పక్కా దుకాణాలు ఉన్నాయి. కొవిడ్ సమయంలో ఇందులోని కూరగాయల దుకాణాలను చింతపల్లి రోడ్డులో డిగ్రీ కళాశాల వద్దకు తరలించారు. దుకాణాల అద్దెల రూపంలో నెలకు రూ.3.6 లక్షల మేర ఆదాయం వస్తుంది. అయితే కూరగాయ దుకాణాల తరలింపుతో ఇక్కడ తమకు వ్యాపారాలు లేవంటూ ఇతర దుకాణదారులు అద్దెలు చెల్లించడం మానేశారు. ఒక్కో దుకాణం రూ.2 లక్షల వరకు అద్దె బకాయిలు వున్నట్టు తెలిసింది. మండల పరిషత్ అధికారులు ఇటీవల ఆయా దుకాణదారులకు నోటీసులు పంపారు.
65:35 నిష్పత్తిలో ఆదాయ పంపకం!
ఇందిరా మార్కెట్ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించిన తర్వాత వచ్చే ఆదాయంలో 65 శాతం మునిసిపాలిటీ తీసుకుని, 35 శాతం మండల పరిషత్‌కు ఇవ్వడానికి మునిసిపల్ అధికారులు ప్రతిపాదన చేశారు. అయితే మండల పరిషత్ ప్రస్తుత పాలకవర్గం ఆమోదించడం లేదని, ఆదాయం చెరి సగం అయితే అభ్యంతరం లేదని అంటున్నారని నర్సీపట్నం ఎంపీడీవో చెప్పారు.