Share News

నామినేషన్లకు శ్రీకారం

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:50 AM

జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులకు ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అయితే అధికార, ప్రతిపక్షాలు తమ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు చేయకపోవడంతో తొలిరోజు నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగింది.

నామినేషన్లకు శ్రీకారం
బుచ్చెయ్యపేట మండలం వడ్డాది సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేస్తున్న కూటమి బలపరిచిన దొండా నరేశ్‌తోపాటు చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, తదితరులు

పంచాయతీల్లో తొలిరోజు ఊపందుకోని ప్రక్రియ

ఎనిమిది మండలాల్లో సర్పంచ్‌ స్థానాలకు 183, వార్డు స్థానాలకు 527 నామినేషన్లు దాఖలు

అనకాపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులకు ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అయితే అధికార, ప్రతిపక్షాలు తమ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు చేయకపోవడంతో తొలిరోజు నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగింది. మొత్తం మీద 70 కేంద్రాల్లో మొదటి రోజు సర్పంచ్‌ పదవులకు 183, వార్డు పదవులకు 527 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా చూస్తే... బుచ్చెయ్యపేటలో అత్యధికంగా సర్పంచ్‌ పదవులకు 36, వార్డు పదవులకు 94 నామినేషన్లు దాఖలయ్యాయి. సబ్బవరం మండలంలో సర్పంచులకు 30, వార్డులకు 58, కశింకోట మండలంలో 24 సర్పంచ్‌, 96 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. అనకాపల్లి మండలంలో సర్పంచులకు 18, వార్డులకు 63, చోడవరం మండలంలో సర్పంచులకు 23, వార్డులకు 68, రావికమతం మండలంలో సర్పంచులకు 23, వార్డులకు 58, రోలుగుంట మండలంలో సర్పంచులకు 10 వార్డులకు 28, పరవాడ మండలంలో సర్పంచ్‌ పదవులకు 19, వార్డు పదవులకు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా నామినేషన్ల దాఖలకు మంగళవారం వరకు గడువు వుంది. రాగల రెండు రోజుల్లో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేసే అవకాశం వుంది.

ఫొటోరైటప్‌:

15ఎకెపి రూరల్‌-2- ఎస్పీ తుహిన్‌సిన్హా

ప్రశాంత ఎన్నికలకు పటిష్ట చర్యలు

ఎస్పీ తుహిన్‌సిన్హా

అనకాపల్లి రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైన ఎనిమిది మండలాల్లో పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నామినేషన్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో పోలీసు నిబంధనలను పక్కాగాఅమలు చేయాలన్నారు. నామినేషన్‌ దాఖలు కేంద్రాల సమీపంలో ప్రజలు గుంపులుగా గుమికూడడం, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖల నుంచి పోలింగ్‌ ముగిసి, ఎన్నికల ఫలితాలు ప్రకటించే వారకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదని పోలీసులు, అధికారులకు స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

Updated Date - Nov 16 , 2026 | 12:50 AM