నృసింహ దీక్షలకు శ్రీకారం
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:28 AM
సింహాచలం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సింహాచలం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై అర్చకులు సోమవారం చందన మాలల సమర్పణతో నృసింహ మండల దీక్షలకు శ్రీకారం చుట్టారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
సంప్రదాయబద్ధంగా ప్రారంభం
సింహాచలం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై అర్చకులు సోమవారం చందన మాలల సమర్పణతో నృసింహ మండల దీక్షలకు శ్రీకారం చుట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి సేవాకాలం, ధూపసేవ, బాలభోగ నివేదనలు పూర్తిచేశారు. ప్రధాన రాజగోపురం వద్ద సాంకేతిక శాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఉంచిన సింహాద్రినాథుని నమూనా వద్ద నుంచి ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల సారథ్యంలో చందన మాలలను శిరస్సుపై దాల్చి మాడవీధిలో ప్రదక్షిణగా తిరిగి స్వామి వారి వద్దకు చేరుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య షోడశోపచారాల పూజలు పూర్తిచేశారు. పుణ్యాహవాచన తీర్థజలాలతో మాలలను, భక్తులను ప్రోక్షణ చేశారు. అనంతరం దీక్షధారుల మెడలో ప్రధానార్చకులు మాలలు వేసి నృసింహ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షా సమయంలో అనుసరించాల్సిన నియమాలను వివరించారు. భక్తపీఠాల వ్యవస్థాపకులు కసిరెడ్డి సురేంద్ర, సానబోయిన పైడిరాజు అప్పన్న భజనలు చేశారు. దీక్షలు స్వీకరించిన భక్తులు ఆరాధ్యదైవాన్ని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఏర్పాట్లను ఈవో వెంకటరావు, ఏఈఓ శ్రీనివాసరావు, పర్యవేక్షణాధికారులు, పీఆర్వో అప్పలనాయుడు పర్యవేక్షించారు.
‘డొమినోస్’లో గడువు తీరిన ఆహార పదార్థాలు!
ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీల్లో గుర్తింపు
విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ఎన్ఏడీ జంక్షన్లో గల ‘డొమినోస్’లో గడువుతీరిన ఆహార పదార్థాలను ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు గుర్తించారు. సోమవారం ఉదయం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్.కల్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. పిజ్జాల తయారీకి వినియోగించే కొన్నిరకాల వస్తువులు గడువు తీరి ఉండడాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. వినియోగంలో ఉన్న ప్యాకెట్‌తోపాటు మరో ప్యాకెట్‌పై ఉన్న గడువు ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. అయినప్పటికీ తయారుచేసే గదిలో ఇవి ఉండడాన్ని గుర్తించారు. దీనిపై కిచెన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించగా, సరైన సమాధానాన్ని ఇవ్వలేదు. దీంతో ఆయా ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత, ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఈ తరహా లోపాలు లేకుండా చూడాలని స్పష్టం చేయడంతోపాటు నోటీసులను జారీచేశారు. హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు తప్పనిసరిగా ప్రజలకు నాణ్యమైన, కల్తీ లేని ఆహారాన్ని అందించాలని, లోపాలు ఉంటే చర్యలు తప్పవని కల్యాణ్ చక్రవర్తి హెచ్చరించారు.
6 నుంచి ‘కోర్బా’ ఎక్స్‌ప్రెస్ గమ్యం కుదింపు
విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
బిలాస్పూర్ డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో వచ్చే నెల ఆరో తేదీ నుంచి విశాఖ-కోర్బా ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ-కోర్బా ఎక్స్‌ప్రెస్ (18518) డిసెంబరు 6 నుంచి 17 వరకు విశాఖ-బిలాస్పూర్ మధ్య, తిరుగు ప్రయాణంలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ (18517) డిసెంబరు 7 నుంచి 18 వరకు బిలాస్పూర్-విశాఖ మధ్య నడుస్తాయని పేర్కొన్నారు. బిలాస్పూర్-కోర్బా మధ్య రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. విశాఖ-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ (20807) డిసెంబరు 13, 14, 15 తేదీల్లోఒక గంట ఆలస్యంగా బయలుదేరేవిధంగా రీ షెడ్యూల్ చేశామన్నారు.