పెద్దాస్పత్రికి సాంత్వన!
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:45 AM
ఉత్తరాంధ్రుల పెద్దాస్పత్రి కేజీహెచ్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) కింద నిధులు అందించేందుకు అనేక సంస్థలు ముందుకువస్తున్నాయి. ఆస్పత్రి అధికారుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇబ్బడిముబ్బడిగా నిధులు సమకూరుతున్నాయి. ఈ నిధులను ఆస్పత్రిలో వివిధ విభాగాల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన, ఆధునిక పరికరాల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు.
అభివృద్ధికి చేయూతనందిస్తున్న సంస్థలు
కలెక్టర్ చొరవతో సమకూరిన సీఎస్‌ఆర్ నిధులు
కీలక విభాగాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగం
అత్యాధునిక పరికరాలు ఏర్పాటు
రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే ధ్యేయం
విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్రుల పెద్దాస్పత్రి కేజీహెచ్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) కింద నిధులు అందించేందుకు అనేక సంస్థలు ముందుకువస్తున్నాయి. ఆస్పత్రి అధికారుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇబ్బడిముబ్బడిగా నిధులు సమకూరుతున్నాయి. ఈ నిధులను ఆస్పత్రిలో వివిధ విభాగాల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన, ఆధునిక పరికరాల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు.
కేజీహెచ్ అభివృద్ధికి ఒక్క ఏడాదిలో సుమారు రూ.15 కోట్లు సీఎస్‌ఆర్ నిధులు అందాయి. ఇందులో ఎన్టీపీసీ రూ.2 కోట్లు అందించగా, ఈ మొత్తంతో నెఫ్రాలజీ విభాగానికి అవసరమైన పది డయాలసిస్ యంత్రాలు, ఇతర పరికరాలను కొనుగోలు చేశారు. గ్యాస్ర్టో ఎంటరాలజీ విభాగానికి రూ.50 లక్షలతో ల్యాప్రోస్కోపిక్ మెషీన్లను కూడా ఈ సంస్థ అందించింది. హెచ్‌పీసీఎల్ సంస్థ రూ.1.2 కోట్ల నిధులివ్వగా ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో బర్న్స్ వార్డును ఆధునికీకరించారు. రూ.50 లక్షలను అభివృద్ధికి కేటాయించగా, రూ.70 లక్షలను అత్యాధునిక పరికరాల కొనుగోలుకు వినియోగించనున్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్ సంస్థ రూ.కోటి అందించగా క్యాజువాల్టీ, ఫిజియోథెరపీ విభాగం, ఫార్మసీ కౌంటర్లను ఆధునికీకరిస్తున్నారు. దివీస్ సంస్థ సమకూర్చిన రూ.1.28 కోట్లతో ఎనిమిదిచోట్ల ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పోర్టు ట్రస్ట్ అదనంగా అందించిన రూ.6 లక్షలతో మరో మూడుచోట్ల ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేశారు. ఐడీబీఐ బ్యాంకు ఇచ్చిన రూ.3 లక్షలతో కార్డియాలజీ విభాగానికి అత్యాధునిక టీఎంటీ మెషీన్‌ను కొనుగోలు చేశారు. ఇసాయ్ ఫార్మా సంస్థ పీడియాట్రిక్ విభాగానికి అవసరమైన శస్త్రచికిత్స పరికరాలను రూ.15 లక్షలతో కొనుగోలు చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు రూ.3 లక్షలతో ఏసీలు, ఫ్యాన్లను సమకూర్చింది. ఇదే సంస్థ సుమారు రూ.2 కోట్లతో కార్డియాలజీ విభాగానికి హార్ట్, లంగ్ మెషీన్, టెంపరేచర్ కంట్రోల్ మెషీన్లను అందించింది.
ఆస్పత్రిలో కీలక విభాగాలకు అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కలెక్టర్‌ను కోరిన వెంటనే సానుకూలంగా స్పందించి, వివిధ కంపెనీల నుంచి సీఎస్‌ఆర్ నిధులు సమకూరేలా కృషి చేశారని ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్ బీవీ రమణ తెలిపారు. ఇప్పటివరకు అందిన నిధులతో వివిధ విభాగాలకు కొత్త పరికరాలు, మౌలిక వసతులు కల్పించామన్నారు.