క్యాన్సర్ రోగులకు సాంత్వన
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:20 AM
ఉత్తరాంధ్ర పేదల పెద్దాస్పత్రి కేజీహెచ్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది.
కేజీహెచ్‌లో ఉచితంగా ఖరీదైన వైద్యం
నాలుగో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఇమ్యునోథెరపీ
ఒక్కో సైకిల్‌కు రూ.4 లక్షల వ్యయం
17 సైకిల్స్ వరకు పూర్తిగా ఉచితం
రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర పేదల పెద్దాస్పత్రి కేజీహెచ్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఊపిరితిత్తుల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ నాలుగో దశకు చేరుకున్న బాధితులకు అందించే అత్యంత ఖరీదైన ఇమ్యునోథెరపీని ఉచితంగా అందించేందుకు కేజీహెచ్ ఎంపికైంది. దేశవ్యాప్తంగా 61 మెడికల్ కాలేజీల్లో ఈ చికిత్సపై జరుగుతున్న క్లినికల్ పరిశోధనలకు కేజీహెచ్‌ను ఎంపిక చేయడంతో ఈ ప్రాంతానికి చెందిన రోగులకు అవకాశం దక్కనుంది. రాష్ట్రంలోనే ఈ అవకాశాన్ని దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ ఆస్పత్రిగా కేజీహెచ్ నిలిచింది.
ఇప్పటివరకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ నాలుగో దశలో ఉన్న రోగులకు అందిస్తున్న కీమో థెరపీ తోపాటు క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఏడాది వరకు ఉచితంగా ఇమ్యునోథెరపీ చేయనున్నారు. సాధారణంగా ఇమ్యునోథెరపీ ఒక్కో సైకిల్‌కు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మూడు వారాలకు ఒకసారి చొప్పున ఏడాదికి 17 థెరపీలను అంటే సుమారు రూ.68 లక్షల విలువైన వైద్యాన్ని రోగులకు ఉచితంగా అందించనున్నారు.
వీరికి మాత్రమే అవకాశం..
ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడిన నాలుగో దశకు చేరి న రోగులకు మాత్రమే ఇమ్యునోథెరపీ చేస్తారు. 18 నుం చి 60 ఏళ్లలోపు వయసున్న రోగులు అర్హులు. క్యాన్సర్ మూలం లంగ్‌లో ఉండి ఇతర ఆర్గాన్స్‌కు వెళ్లినప్పటికీ కొన్నిరకాల పరీక్షలు నిర్వహించి ఫిట్‌గా ఉన్న వారికి ఈ థెరపీ చేస్తారు. దీనివల్ల 50 శాతం మందిలో మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ఇది దోహదపడుతుందని, మరో 30 నుంచి 40 శాతం మందిలో వ్యాధి తీవ్రత పెరగ దన్నారు. నాలుగో దశలో ఉన్న వారిలో సగం మందికి పైగా రోగులకు మేలు జరుగుతుందంటున్నారు.