Share News

దైవదర్శనానికి వచ్చి...

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:00 AM

దైవదర్శనం చేసుకున్న ఆనంద క్షణాలు అంతలోనే ఆవి రయ్యాయి. ఘాట్‌రోడ్డు మలుపు తిరుగుతుండగా జరిగిన ప్రమాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మరో నలుగురు తీవ్రగాయాలతో, ఇద్దరు స్వల్పగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన పద్మనాభం మండలం అనంత పద్మనాభుని ఆలయ ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

దైవదర్శనానికి వచ్చి...
మృతి చెందిన ప్రసాద్‌ (ఫైల్‌ ఫొటో)

అనంతపద్మనాభుని ఆలయ ఘాట్‌రోడ్డులో కారు బోల్తా

నర్సీపట్నానికి చెందిన ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

పద్మనాభం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): దైవదర్శనం చేసుకున్న ఆనంద క్షణాలు అంతలోనే ఆవి రయ్యాయి. ఘాట్‌రోడ్డు మలుపు తిరుగుతుండగా జరిగిన ప్రమాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మరో నలుగురు తీవ్రగాయాలతో, ఇద్దరు స్వల్పగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన పద్మనాభం మండలం అనంత పద్మనాభుని ఆలయ ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని రామారావుపేటకు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు ఆదివారం కారులో అనంతపద్మనాభుని దర్శించుకునేందుకు వచ్చారు. ఘాట్‌రోడ్డు గుండా ఆలయానికి చేరుకుని, స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి కారులో బయలుదేరారు. కిందకు వస్తుండగా ఘాట్‌రోడ్డు దిగువున తొలిమలుపు వద్ద అదుపుతప్పిన కారు సమీపంలోని తోటలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గంటి వీవీఎస్‌ ప్రసాద్‌ (28) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారిలో పారి కిరణ్‌, పారి హరిహరన్‌, పారి అనూష, పారి సుప్రియలకు తీవ్ర గాయాలయ్యాయి. కారుడ్రైవర్‌ పారి ఆదిత్య, పారి సమన్వితలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొద్దిసేపటికి 108 అంబులెన్స్‌ వచ్చింది. గాయపడిన ప్రసాద్‌కు అంబులెన్స్‌ ఈఎంటీ తిరుపతి సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అనంతరం క్షతగాత్రులను 108 వాహనంలో విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ సూర్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పద్మనాభం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 01:00 AM