రైస్ మిల్లర్లతో కుమ్మక్కు
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:21 AM
శ్రీకాకుళం జిల్లాలోని రైస్‌మిల్లుల నుంచి పెందుర్తి పౌర సరఫరాల గోదాముకు పంపాల్సిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)లో రేషన్ బియ్యం కలిపిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మిల్లర్లు తక్కువ రేటుకు అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఎక్కువ రేటుకు పౌర సరఫరాల గోదాముకు తరలించారు. ఇందులో గోదాముకు వచ్చే బియ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పౌర సరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదాములో ప్రైవేటు సంస్థ తరపున పనిచేసే ఇన్‌చార్జి, పౌర సరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)...ఇద్దరూ మిల్లర్లకు సహకరించారంటున్నారు.
పౌర సరఫరాల గోదాముకు
మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ బదులుగా
రేషన్ బియ్యం సరఫరా చేసినా పట్టని పౌర సరఫరాల అధికారులు
లారీల నుంచి శాంపిల్స్ తీసి నాణ్యత నిర్ధారించుకోవాలనేది నిబంధన
చూసీచూడనట్టు వ్యవహరించిన టెక్నికల్ మేనేజర్
అందరికీ వాటాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
శ్రీకాకుళం జిల్లాలోని రైస్‌మిల్లుల నుంచి పెందుర్తి పౌర సరఫరాల గోదాముకు పంపాల్సిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)లో రేషన్ బియ్యం కలిపిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మిల్లర్లు తక్కువ రేటుకు అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఎక్కువ రేటుకు పౌర సరఫరాల గోదాముకు తరలించారు. ఇందులో గోదాముకు వచ్చే బియ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పౌర సరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదాములో ప్రైవేటు సంస్థ తరపున పనిచేసే ఇన్‌చార్జి, పౌర సరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)...ఇద్దరూ మిల్లర్లకు సహకరించారంటున్నారు.
పౌర సరఫరాల గోదాముకు రవాణా చేసే బియ్యంలో రేషన్ బియ్యం కలిపిన వ్యవహారంపై ఈనెల 18న ‘రైస్‌మిల్లర్ల మాయాజాలం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం కలకలం రేపింది. ఇందులో మిల్లర్లతో పౌర సరఫరాల సంస్థ అధికారులు మిలాఖత్ అయ్యారనేది బహిరంగ రహస్యం. పెందుర్తిలో 50 వేల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదామును ప్రైవేటు సంస్థ నిర్మించగా, పౌర సరఫరాల సంస్థ అద్దెకు తీసుకుంది. ఈ గోదాము నుంచి బియ్యాన్ని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో రేషన్ డిపోలకు సరఫరా చేస్తారు. పెందుర్తి గోదాములో విశాఖ, అనకాపల్లి జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయాలకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) విధులు నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో రైస్‌మిల్లు నుంచి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఏ జిల్లాకు కేటాయిస్తే ఆ జిల్లా అసిస్టెంట్ మేనేజరు (టెక్నికల్) లారీ నుంచి శ్యాంపిల్స్ తీసి నిబంధనల మేరకు నాణ్యతను నిర్ధారించాలి. ఆ తరువాతే బియ్యం (దీనినే పాస్ ఆర్డర్ అని అంటారు) అన్‌లోడ్ చేస్తారు. ఒకవేళ నాణ్యత లేకపోతే లారీని తిరిగి వెనక్కి పంపాలి. కానీ శ్రీకాకుళం జిల్లాలోని 36 రైస్‌మిల్లుల నుంచి పెందుర్తి గోదాముకు వచ్చిన 700 లారీల బియ్యాన్ని (20 వేల టన్నులు) తూతూమంత్రంగా పరిశీలించి గోదాములోకి అనుమతించారనే ఆరోపణ వినిపిస్తోంది. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లకు తలొగ్గడంతోపాటు స్థానికంగా రైస్ మాఫియా చెప్పినట్టు చేశారని ప్రచారం సాగుతుంది. వీరిపై పౌర సరఫరాల శాఖ జిల్లా కార్యాలయాల నుంచి ఒత్తిడి వచ్చిందా?...లేక మామూళ్లకు అలవాటుపడ్డారా అనేది తేలాలి. మిల్లర్లతో విశాఖ, అనకాపల్లి జిల్లాల పౌర సరఫరాల సంస్థలో కొందరు అధికారులు మిలాఖత్ అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి లారీ నుంచి పర్సంటేజీ అన్ని స్థాయిల్లో అందుతుందని నగరానికి చెందిన బియ్యం వ్యాపారి ఒకరు వ్యాఖ్యానించారు. గోదాములో విధులు నిర్వహించే అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) స్థాయి అధికారులు..పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పరిధిలోనే విధులు నిర్వహిస్తారు. పెందుర్తి గోదాము రెండు జిల్లాలకు సంబంధించినది కావడంతో నాణ్యతకు ఇద్దరు డీఎంలు బాధ్యులవుతారన్న వాదన వినిపిస్తోంది. డీఎంలు పక్కాగా తనిఖీలు చేసి ఉంటే గోదాముకు రేషన్ బియ్యం రాకకు అడ్డుకట్ట పడేదని చెబుతున్నారు.
పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు తనిఖీ చేసేంత వరకు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదాముకు రైస్ మిల్లర్లు సరఫరా చేసే బియ్యం కిలో రూ.46. అదే రేషన్ బియ్యమైతే రేషన్ డీలర్లు, చిరు వ్యాపారుల నుంచి కిలో రూ.20 నుంచి రూ.23 కొనుగోలు చేస్తారు. అంటే సగానికి సగం లాభం. పెందుర్తి గోదాముకు శ్రీకాకుళం నుంచి వచ్చిన బియ్యంలో కొంతవరకు రేషన్ బియ్యం కలిశాయని నగరానికి చెందిన బియ్యం వ్యాపారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ములు చేతులు మారాయన్నారు. దీనిపై పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు కాకుండా సీనియర్ ఐఏఎస్ అధికారి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోని వస్తాయని అభిప్రాయపడ్డారు.